ఇద్దరు పిచ్చోళ్లతో అనర్థమే

24 Dec, 2019 10:35 IST|Sakshi

దిశ చట్టం దేశానికే తలమానికం

కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి

సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్‌కల్యాణ్‌ మూడు రాజధానుల విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని, ఇద్దరు పిచ్చోళ్లతో అనర్థమేనని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మండలంలోని దామరమడుగు, రేబాల, జొన్నవాడ గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల అభిప్రాయాన్ని శాసనసభలో తెలిపారన్నారు.

దీనిపై చంద్రబాబు, అతను ఇచ్చే సూట్‌కేసులకు అమ్ముడుపోయిన పవన్‌కల్యాణ్‌ రాజధాని ప్రజలను రెచ్చగొట్టి గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. రాజధాని మారితే అక్కడ ప్రజలు భూములను దోచుకున్న చంద్రబాబు అండ్‌ కో నేతలకు నష్టమని ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో అన్ని ప్రాంతాల సమస్యలను తెలుసుకున్నారని, వాటన్నింటిని అభివృద్ధి చేయాలనే సీఎం మూడు రాజధానులను ప్రకటించినట్లు వివరించారు. దిశ చట్టం దేశానికే తలమానికంగా మారిందన్నారు.

మహిళల రక్షణకు ఎంతో ఉపయోగపడేలా చట్టం ఉందన్నారు. దీనిపై అన్ని రాష్ట్రాల నేతలు దృష్టి సారించారని ఆయన తెలిపారు. ‘నాడు–నేడు’తో పాఠశాలలకు పెద్దపీట సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు–నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందనున్నాయన్నారు. రాష్ట్రంలోని 45,512 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.12 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ఇందు లో తొలివిడతగా 15,715 పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు రూ.3,500 కోట్లు కేటాయించారని, నియోజకవర్గంలో 100 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. 

మరిన్ని వార్తలు