ఫేక్‌ ట్వీట్‌పై చంద్రబాబుకు ప్రశాంత్‌ కిషోర్‌ కౌంటర్‌

11 Apr, 2019 16:22 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని సర్వేలన్నీ ఘోషిస్తుండడం, క్షేత్ర స్థాయిలో ఫ్యాన్‌ ఫుల్‌ స్పీడ్‌లో తిరుగుతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన దిగజారుడు రాజకీయాలకు మరోసారి పదును పెంచి అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికే ఫేక్‌ ఆడియోలు, ఫేక్‌ గొడవలు, ఫేక్‌ ధర్నాలు, ఫేక్‌ సర్వేల పేరుతో అనుకూల మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేపించిన చంద్రబాబు, చివరి అస్త్రంగా పోలింగ్‌ జరుగుతున్న సమయంలోనే ఫేక్‌ ట్వీట్‌లను సృష్టించి ఓట్లు రాబట్టాలనుకున్నారు. ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పేరిట ఓ ఫేక్‌ ట్వీట్‌ను సృష్టించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. అయితే ఈ తప్పుడు వార్తలపై ప్రశాంత్‌ కిషోర్‌ తన అధికారిక ట్విట్టర్‌లో స్పందించారు.

'ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు, వారి విజ్ఞతమీద నమ్మకం లేనప్పుడు, ఇలా దిగజారిపోయి నిందలు వేస్తారు. అసత్యాలు, నకిలీ వార్తలు ప్రచారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమ తీర్పును నిర్ణయించుకున్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్‌ ముగియనుంది. బై బై బాబు అని చెప్పడానికి ఇదే సరైన సమయం' అంటూ ఫేక్‌ ట్వీట్‌ ఫోటోతో పోస్ట్‌ పెట్టి చంద్రబాబును ట్యాగ్‌ చేశారు.

మరిన్ని వార్తలు