నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళిక

21 Feb, 2014 23:42 IST|Sakshi

సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: వచ్చే వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఆర్‌డబ్ల్యూఎస్ ముందస్తు చర్యలు చేపట్టింది. మంచినీటి కొరత ఎదుర్కొనే గ్రామాలను గుర్తించడంతోపాటు నీటి సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు రూ.4.45 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేసింది. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అందజేసిన ప్రణాళికను పరిశీలించి త్వరలో సర్కార్ నిధులు విడుదల చేయనుంది. వచ్చేనెల మొదటి వారం నుంచి ఈ ప్రణాళిక అమలు దిశగా జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు.

 వచ్చే వేసవిలో 41 మండలాల్లోని 903 గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తవచ్చని అధికారులు గుర్తించారు. కౌడిపల్లి మండలంలో అత్యధికంగా 55  గ్రామాలు, నారాయణఖేడ్ మండలంలో 55, సిద్దిపేట, తూప్రాన్  మండలాల్లో 50 గ్రామాల చొప్పున, చిన్నకోడూరు మండలంలో 42, కొల్చారం, నర్సాపూర్ మండలాల్లో 41 చొప్పున, జగదేవ్‌పూర్‌లో 40 గ్రామాలను ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బంది గుర్తించింది. గత నెల జనవరిలో సిబ్బంది సర్వే చేసి వేసవిలో తాగునీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాలను గుర్తించారు. సర్వే నివేదికను అనుసరించి అధికారులు రూ.4.45 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేశారు.

 రూ.1.60 కోట్లతో నీటి రవాణా
 ప్రత్యామ్నాయ ప్రణాళికను అనుసరించి రాబోయే వేసవిలో రూ.4.45 కోట్ల వ్యయంతో 12,447 పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. అందులో భాగంగా రూ.1.60 కోట్లతో గ్రామాల్లో తాగునీటి రవాణా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే 343 పంచాయతీల్లో రూ.74.2 లక్షలతో 457 బోరుబావులను అద్దెకు తీసుకోవాలని ప్రతిపాదించారు. రూ.90.74 లక్షలతో 960 బోరు బావులు ఫ్లష్షింగ్ చేయాలని, రూ.79.62 లక్షలతో 873 బోరుబావులను డీపెనింగ్ (మరింత లోతుకు) చేయనున్నారు. అలాగే రూ.40.5 లక్షలతో 31 ఓపెన్ వెల్స్‌ను డీపెనింగ్ చేయాలని ప్రత్యామ్నాయ ప్రణాళికలో ప్రతిపాదించారు.

మరిన్ని వార్తలు