జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను తరిమేయొచ్చు : ఆళ్ల నాని

7 Apr, 2020 16:25 IST|Sakshi

సాక్షి, కడప : కడప జిల్లాలో కరోనా వైరస్ నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై చర్చించామన్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూనే కరోనా నిర్మూలనకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఆరుగురు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు తిరిగి నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 664 కేసులకు సంబంధించి శ్యాంపిల్స్ తీయగా 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.


విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉంటే వెంటనే క్వారంటైన్‌కు తరలించామని డిప్యూటీ సీఎం అన్నారు. వారికి ఎవరికి పాజిటివ్ రాలేదని తెలిపారు. జిల్లాలో నమోదైన 27 పాజిటివ్ కేసులు అన్ని ఢిల్లీ మీటింగ్‌కి వెళ్లి వచ్చిన వాళ్లవే అన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన వారి ఇంటి సమీప ప్రాంతాల్లో శ్యానిటేషన్ పకడ్బందీగా చేశామన్నారు. రెడ్ జోన్ పరిధిలోకి ఎవరినీ అనుమతించడం లేదన్నారు. జిల్లా ప్రజలు ఎవరు బయపడవద్దన్నారు. జిల్లాలో కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. లాక్ డౌన్ కు సంబంధించి ప్రజలు స్వచ్చందంగా మద్దతు తెలపాలన్నారు. సామాజిక దూరంతోనే కరోనా నివారించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాల్లో బయటకు ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దని సూచించారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను తరిమేయవచ్చని, నిన్నటి నుండి కడప రిమ్స్ ఆస్పత్రిలో టెస్టింగ్ ల్యాబ్ పూర్తి స్థాయిలో పని చేస్తుందని తెలిపారు.

>
మరిన్ని వార్తలు