ఎమర్జెన్సీకి అయినా డోలీ కట్టాల్పిందే!

21 Jul, 2019 14:49 IST|Sakshi

కొత్తవలస నుంచి శంకరం వరకు రోడ్డు లేక గిరిజనుల ఇక్కట్లు

సాక్షి, విజయనగరం: గర్బిణికి పురిటినొప్పులు రావడంతో ఆమెను డోలీపై ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ దయనీయ సంఘటన వీ.మాడుగుల మండలం శంకరం పంచాయతీ కొత్తవలసలో ఆదివారం చోటుచేసుకుంది. కొత్తవలస గ్రామానికి చెందిన గర్బిణీ జనపరెడ్డి దేవీకి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కానీ ఆ గ్రామంలో రోడ్డు సదుపాయం లేకపోవడంతో బంధువులు 15 కిలోమీటర్లు డోలీలో తీసుకెళ్లి కేజేపురం ఆసుపత్రికి చేర్పించారు. అక్కడ ఆమె ఆడపిల్లను ప్రసవించింది. కాగా సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకోవడంతో తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదం తప్పింది.

కొత్తవలస నుంచి శంకరం వరకు రోడ్డు సదుపాయం లేదు. దీంతో గిరిజనులు అత్యవసర సమయాల్లో డోలీని ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఎవరికైన ఆపద వస్తే వారి బంధువులే డోలీ కట్టి, అందులో వారిని కూర్చుండబెట్టి కిలోమీటర్లు నడక సాగించి ఆసుపత్రికి చేరుస్తున్నారు. కొన్నిసార్లు అత్యవసర వైద్యం అందక దారి మధ్యలోనే మృత్యువాత పడ్డ సంఘటనలు ఉన్నాయి. కాగా అక్కడి గిరిజనులు రోడ్డు సదుపాయం కల్పించాలని అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదు.

మరిన్ని వార్తలు