క్షణమొక యుగంలా..!

31 Aug, 2019 07:29 IST|Sakshi
చిందులపాడు నుంచి డోలీ కట్టి గర్భిణిని ఆస్పత్రికి తీసుకొస్తున్న కుటుంబ సభ్యులు

నిండు గర్భిణి నరకయాతన

ఐదు కి.మీ. డోలీ ప్రయాణం

దేవరాపల్లి పీహెచ్‌సీలో ప్రసవం

సాక్షి,దేవరాపల్లి (దేవరాపల్లి): పురిటినొప్పులు భరించి, ప్రసవించడం ఆడవాళ్లకు పునర్జన్మతో సమానం. అయితే బిడ్డను చూడగానే కష్టాన్నంతా మరిచిపోయి మమకారపు మధురిమలు ఆస్వాదిస్తారు. కానీ మన్యంలో మహిళలకు ప్రసవ వేదన కాస్తా నరకయాతనగా మారుతోంది. వారి జీవితాల్లో భయానక ఘటనగా మిగులుతోంది. ఇందుకు అనంతగిరి మండలం పినకోట పంచాయతీ చిందులపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన ఘటనే నిదర్శనం.. గ్రామానికి చెందిన నిండు గర్భిణి జన్ని లక్ష్మి నరకయాతన అనుభవించింది. శుక్రవారం ఉదయం 4 గంటలకు పురిటినొప్పులు రావడంతో దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా కుటుంబ సభ్యులు తట్టలో కూర్చోపెట్టి ఐదు కిలోమీటర్లు డోలీ మోశారు. ఈ గ్రామానికి ఫోన్‌ సదుపాయంతో పాటు రహదారి సౌకర్యం కూడా లేక పోవడంతో ఎంత ప్రమాదకర పరిస్థితి అయినా కాలి నడకే దిక్కు. దీంతో పురిటి నొప్పులతో విలవిల్లాడిపోతున్న గర్భిణీని కొండలు, గుట్టలు దాటించి మోసుకొచ్చారు.

తల్లీబిడ్డ క్షేమం..
దేవరాపల్లి పీహెచ్‌సీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్లిపురం గ్రామానికి ఆశా కార్యకర్త బుచ్చమ్మ కుటుంబ సభ్యుల సహకారంతో అతి కష్టం తీసుకొచ్చారు. లక్ష్మీ భర్త దేముడు ముందుగా బల్లిపురానికి చేరుకొని ఏఎన్‌ఎం పుష్పకు సమాచారం అందించడంతో ఆమె అక్కడి నుంచి ఆటోలో దేవరాపల్లి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పీహెచ్‌సీ సిబ్బంది సుఖప్రసవం చేయించడంతో లక్ష్మి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు