పరిమళించిన మానవత్వం

4 Feb, 2019 08:43 IST|Sakshi
108 వాహనంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం అసహాయ స్థితిలో ఉన్న చిన్నారులను లాలిస్తున్న ఆసుపత్రి సిబ్బంది

రైలులో మహిళకు పురిటి నొప్పులు

108లో ఆస్పత్రికి తరలింపు

సుఖ ప్రసవం.. తల్లీబిడ్డా క్షేమం

కారుణ్యం కాంతులీనింది.. మానవీయత పరిమళించింది.. రైలు ప్రయాణంలో పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ నిండు చూలాలిని సకాలంలో ఆదుకుంది.. సుఖ ప్రసవం కావడంతో ఓ ముద్దులొలికే చిన్నారి కన్ను తెరిచింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. భర్తది బెంగళూరు.. కన్నవారిది బిహార్‌ రాష్ట్రం.. పురుడు కోసం ఇద్దరు చంటి బిడ్డలతో రైల్లో బయలుదేరిందో నిండు గర్భిణి.. యలమంచిలికి వచ్చేసరికి నొప్పులు రావడంతో ఆమెను దింపి, 108లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె మరో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి వచ్చే వరకు ఆమె ఇద్దరు పిల్లలను సంరక్షించే బాధ్యతను ఆస్పత్రి సిబ్బంది
తీసుకున్నారు.

విశాఖపట్నం, యలమంచిలి రూరల్‌ : రైలులో ప్రయాణిస్తున్న నిండు గర్భిణికి నొప్పులు రావడంతో  తోటి ప్రయాణికులు సహాయపడి రైల్వే సిబ్బంది సహా యంతో ఆస్పత్రికి తరలించి కాన్పు జరిపించారు. విశాఖ జిల్లా యలమంచిలిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ  సంఘటన వివరాలిలా ఉన్నాయి. బీహార్‌ రాష్ట్రం భగల్‌పూర్‌కు చెందిన స్వప్నదేవి బెంగళూరు నుంచి యశ్వంత్‌పూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ బోగీలో  ఇద్దరు చిన్న పిల్లలతో  బయలుదేరింది.  నిండు గర్భిణి అయిన ఆమెకు  రేగుపాలెం సమీపంలోకి  వచ్చేసరికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే స్పందించిన తోటి ప్రయాణికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో యలమంచిలి రైల్వేస్టేషన్‌లో 108 వాహనం సిద్ధంగా ఉంచారు. రైలుకు స్టాప్‌ లేకపోయినా యలమంచిలిలో నిలుపుచేసి స్వప్నదేవిని, ఆమె ఇద్దరు కుమార్తెలను యలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రధాన వైద్యుడు డా.శ్రీహరి నేతృత్వంలో ఆమెకు చికిత్స అందించగా సుఖప్రసవం ద్వారా పండంటి బాబుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ యలమంచిలి ప్రభుత్వాసుపత్రిలో క్షేమంగా ఉన్నారు. కాగా స్వప్నదేవి భర్త అనిరుధ్‌ సహాని బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగి. ఇంతకాలం భర్త దగ్గర ఉన్న ఆమె నెలలు నిండడంతో పుట్టింటికి  ఇద్దరు చిన్నారులతో బయలుదేరింది.   విషయం ఫోన్‌ ద్వారా భర్తకు తెలియజేయడంతో అతను బెంగళూరు నుంచి యలమంచిలికి బయలుదేరాడు. ప్రథమచికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు స్వప్నదేవిని, ఆమె ముగ్గురు పిల్లలను స్వస్థలానికి తరలించనున్నట్లు వైద్యసిబ్బంది తెలిపారు.  ఆసుపత్రి సిబ్బంది వారి బాధ్యతను తీసుకుని సపర్యలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు