ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత మృతి

13 May, 2015 02:44 IST|Sakshi

 వైద్యుల నిర్లక్ష్యమే కారణం
 బంధువుల ఆరోపణ

 
ఆత్మకూరు : స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన సరస్వతి(24) అనే బాలింతరాలు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో మంగళవారం తెల్లవారు జామున మృతి చెందింది. అక్కడి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వారం రోజుల కిందట గర్భిణి అయిన సరస్వతిని ప్రసవం కోసం కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ఇద్దరు ఆడపిల్లల(కవలలు)ను ప్రసవించింది. అప్పటికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సోమవారం ఆమెను పరీక్షించిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని, రక్తం ఎక్కించాలని సూచించారు. దీంతో ఆమెకు రక్తం ఎక్కించారు. అప్పటి నుంచి ఆమె అస్వస్థతకు గురైంది. తీవ్ర ఆయాసంతో బాధపడుతోంది. విషయం వైద్యులకు తెలుపగా వారు ఇంజక్షన్లు వేశారు. ఆయాసం తగ్గకపోగా మరింత ఎక్కువై మంగళవారం తెల్లవారుజామును 3 గంటల సమయంలో ఆమె మృతి చెందిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై వైద్యులను ప్రశ్నించగా ‘మేం.. ఏంచేయాలి’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని వారు ఆరోపించారు.

వైద్యుల నిర్లక్ష్యం వల్లనే సరస్పతి మృతి చెందిందని వారు వాపోయారు. మొదటి కాన్పులో సరస్వతికి ఆడపిల్ల పుట్టింది. రెండవ కాన్పులోనూ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. తల్లిలేని ఆ పిల్లలను చూసి.. వారి ఆలనాపాలనా ఎవరు చూస్తారంటూ  బంధువులు, గ్రామస్తులు విలపించారు.

 హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు...
గైనిక్ ఇన్‌చార్జ్ హెచ్‌ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం : సరస్వతి మృతికి కారణంగా హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చునని అనంతపురం ప్రభుత్వాస్పత్రి గైనిక్ ఇన్‌చార్జ్ హెచ్‌ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం తెలిపారు. ప్రసవం కోసం ఆమె ఈనెల 6న ఆస్రత్రిలో చేరిందన్నారు. రక్త పరీక్షలు చేయగా ఆమెకు 8.4 హెచ్‌బీ ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెకు రక్తాన్ని ఎక్కించాం. అనంతరం సిజేరియన్ చేయగా ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారు. మరుసటి రో జు ఆమె దగ్గు, ఆయాసం వస్తోందని తెలిపింది.

ఫిజిషియన్ సలహా మేరకు మరోసారి రక్తాన్ని ఎక్కించాం. పరిస్థితి సీరియస్ కావడంతో ఏఎంసీకి మార్చాం. అ యినా దురదృష్టవశాత్తు ఆమె ఆరోగ్య క్షీణించి మృతి చెందింది. గ్రామీణ ప్రాంతాల నుంచి అనీమియా కేసులు అధికంగా వస్తున్నాయని డాక్టర్ వివరించారు.

మరిన్ని వార్తలు