వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి

26 Feb, 2018 13:52 IST|Sakshi
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి ఘటన వద్ద కనిపించిన హృదయవిదారక చిత్రమిది.

విజయవాడ పాత ఆస్పత్రి వద్ద మృతదేహంతో బంధువుల ఆందోళన

బాధితులతో గుడివాడ ఆర్డీవో చక్రపాణి చర్చలు

ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని లిఖితపూర్వక హామీ  

కనురెప్పలు కూడా పూర్తిగా విప్పుకోలేదు. పేగుబంధం తడి ఆరనేలేదు. పాలు తాగాలన్న పాల పెదవుల ఆర్తి తీరనే లేదు. ఈ పసికందు తల్లిప్రేమకు దూరమైంది. పుట్టగానే కన్నప్రేమ కరువైనా.. అమ్మ పొత్తిళ్లే అనుకుని ఈ పాప తువ్వాలులో హాయిగా నిద్రపోతుంటే.. కన్నబిడ్డను కంటినిండా చూసుకోలేని ఆ అ‘మృత’మూర్తి మౌనంగానే జోలపడింది. మమతానురాగాలకు దూరమైన ఈ తల్లీకూతుళ్లకే మాట లొస్తే.. తమ దుస్థితికి కారణమైన వైద్యుల వైఫల్యాన్ని నిందిస్తారో, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తారో.. లేక.. ఇలాంటి ఎడబాటు మరే తల్లీబిడ్డకు కలిగించొద్దని దేవుడ్ని ప్రార్థిస్తారో..    (విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి ఘటన వద్ద కనిపించిన హృదయవిదారక చిత్రమిది..)    

లబ్బీపేట(విజయవాడ తూర్పు): సిజేరియన్‌ చేయడంలో వైద్యుల నిర్లక్ష్యం బాలింత మృతికి కారణమయ్యిందని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు ఆదివారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తల్లిలేని ఇద్దరు చిన్నారులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. రెండు గంటల పాటు ఆందోళన అనంతరం గుడివాడ ఆర్డీఓ చక్రపాణి ఆస్పత్రి వద్దకు చేరుకుని బంధువులతో చర్చలు జరిపి లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా మండవల్లి మండలం గున్ననపూడి గ్రామానికి చెందిన వంగా చిట్టెమ్మ రెండో కాన్పు కోసం కలిదిండి మండలం చింతలమూరులోను పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 18న ఆమెకు పురిటి నొప్పులు రావడంతో తల్లి చాలంటి బేబీ సరోజిని ప్రసవం కోసం కైకలూరులోని కమ్యూనిటీ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 108 వాహనంతో అక్కడి నుంచి ఏలూరు తరలించారు. అక్కడి వైద్యులూ చిట్టెమ్మకు ప్రసవం చేసేందుకు చేతులెత్తేసి.. విజయవాడ తరలించాలని సూచించారు. దీంతో మరలా అక్కడి నుంచి ఈ నెల 19న విజయవాడ పాత ఆస్పత్రిలో ప్రసూతి విభాగానికి వచ్చారు.

ఒకే రోజు రెండు శస్త్రచికిత్సలు
చిట్టెమ్మను విజయవాడ తరలించే సమయానికే పరిస్థితి విషమంగా మారడంతో గంటలోపే అత్యవసరంగా సిజేరియన్‌ నిర్వహించారు. దీంతో పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారనే ఆనందం గంటల వ్యవధిలోనే ఆవిరైంది. ఆపరేషన్‌ చేసిన పది గంటల తర్వాత కడుపునొప్పి తీవ్రంగా రావడంతో వైద్యులు స్కానింగ్‌ చేశారు. పొట్టలో ఇంట్రావాస్కులర్‌ సిస్టమ్‌(పొట్ట లోపల బ్లీడింగ్‌) దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీంతో మరోసారి అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి గర్భసంచిని సైతం తొలగించారు. అయితే కొన్ని పొరపాట్ల కారణంగా యూరిన్‌ బ్లాడర్‌ దెబ్బతింది. దీంతో ఇక్కడ యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలు లేక పోవడంతో గుంటూరు ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. వారం రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం వేకువజామున మృతి చెందింది. విజయవాడ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందంటూ బంధువులు అక్కడికి చేరుకున్నారు. చిట్టెమ్మకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయడంతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న గుడివాడ ఆర్డీవో అక్కడికి చేరుకొని బంధువులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.

మరిన్ని వార్తలు