గర్భిణి అని చెప్పినా వినకుండా..

7 Jul, 2019 09:20 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రసవ వేదనతో చేరిన గర్భిణిని రెండు రోజుల వరకు ఉంచుకుని, ఆ తర్వాత వైద్యులు వెనక్కి పంపేయడంతో బంధువులు, కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. చివరకు గత్యంతరం లేక స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి ప్రసవం చేయించారు. జలుమూరు మండలం కామునాయుడుపేటకు చెందిన కింజరాపు నీలవేణికి నెలలు నిండటంతో 108 వాహనంలో శుక్రవారం ఉదయం నరసన్నపేట ఆసుపత్రికి ఆశావర్కరు తిరుపతమ్మ సహాయంతో తీసుకువచ్చారు. ఇక్కడ చికిత్సకు వైద్యులు లేరంటూ సాధారణ తనిఖీలు చేసి ఉంచారు.

శనివారం ఉదయం గర్భిణికి ప్రసవం చేసేందుకు ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. అయితే ఎనస్థీషియా డాక్టర్‌ వచ్చి తనిఖీ చేసి నీలవేణికి గుండె జబ్బు ఉందని, ఇక్కడ ఆపరేషన్‌ చేయలేమని వెళ్లిపోయారని భర్త అప్పలనాయుడు, కుటుంబ సభ్యులు పీ భారతి, ఎం నిర్మల, సత్యవతి వాపోయారు. ఈ విషయం చివరి నిమషంలో చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. మొదటి కాన్పు ఇక్కడే చేశారని, రెండో కాన్పునకు ఈ విధంగా చెప్పడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

చివరకు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించగా, అక్కడ వైద్యులు ఎటువంటి కారణాలు చూపలేదని ఆపరేషన్‌ చేస్తామని హామీ ఇచ్చారని భర్త అప్పలనాయుడు తెలిపారు. ఈ విషయమై స్థానిక ఎనస్థీషియా డాక్టర్‌ ప్రసాదరావును వివరణ కోరగా నీలవేణికి థైరాయిడ్‌ ఉందని, గుండెకు సంబంధించిన జబ్బు ఉందని, రిస్క్‌ చేయలేక శ్రీకాకుళం రిమ్స్‌కు వెళ్లాలని సూచించామన్నారు. అంతే తప్ప బలవంతంగా పంపలేదన్నారు.  

మరిన్ని వార్తలు