ప్రాణాలు తోడేస్తున్న రక్తహీనత

1 Mar, 2019 07:31 IST|Sakshi
సంపంగి గరువు గ్రామంలో బాలింతలు, చిన్నారులు

మన్యంలో గిరిజనులకు పోషకాహార కొరత

అర్ధాకలితో అల్లాడుతున్న వైనం

తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రభావం

విస్తరించని అంగన్‌వాడీ వ్యవస్థ

మన్యం వాసులు పోష కాహారానికి దూరమవుతున్నారు. సక్రమంగా  సరఫరా చేయకపోవడంతో గిరిజన తెగలకు చెందిన పిల్లలు, బాలింతలు, గర్భిణులు రక్తహీనత బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి వారికి ప్రాణసంకటంగా మారింది. నీరసించి నిస్సత్తువతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా అధికారుల్లో చలనం లేదనేవిమర్శలు వస్తున్నాయి.

విశాఖపట్నం, పాడేరు : పాడేరు మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో పీటీజీ గిరిజన తెగలకు చెందిన వారు తీవ్ర పోషకాహార సమస్యతో సతమతమవుతున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గిరిజన కుటుంబాల్లోని పసి ప్రాణాలు విలవిల్లాడుతున్నాయి. తల్లీబిడ్డల మరణాలు సంభవిస్తున్నాయి. ఏటా మరణాలు నమోదవుతున్నా  ప్రత్యేక పోషకాహార సరఫరా, వైద్య సేవల కల్పనపై ఎటువంటి చర్యలు కానరావడం లేదు. చాలా గ్రామాలకు అంగన్‌వాడీ వ్యవస్థ కూడా విస్తరించడం లేదు.

అంగన్‌వాడీలే ఆధారం
ఏజెన్సీలో అంగన్‌వాడీల ద్వారా అందిస్తున్న పోషకాహారమే చిన్నారులకు, బాలింతలకు ఆధారం. అయితే వీటిద్వారా అరకొరగానే పోషకాహారం సరఫరా జరుగుతోంది. పర్యవేక్షణ లేకపోవడంతో పంపిణీ అస్తవ్యస్తంగా ఉంటోంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు పంపిణీ సవ్యంగా జరగడం లేదు. నెల రోజులుగా పూర్తిగా పోషకాహారం అందడం లేదు. దీంతో పిల్లలు రక్తహీనతకు గురవుతున్నారు. పిల్లలకు పాలు ఇచ్చేందుకు కూడా గిరిజనులకు పాడి పశువులు లేకుండా పోయాయి. మన్యంలో ఆహార పంటలు బాగా తగ్గిపోయాయి. దీంతో ప్రస్తుతం గిరిజనులకు రాగి అంబలి, కోటా బియ్యమే ప్రధాన ఆహారంగా ఉన్నాయి.

పప్పు దినుసులు, ఇతర పోషకాహారం అందుబాటులో లేని కారణంగా వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి గిరిజనుల ప్రాణాలకు ముప్పు కలుగుతోంది. ఏటా ఏజెన్సీలో సంభవిస్తున్న మరణాలకు కారణం పోషకాహార లోపమేనని వైద్యులు చెబుతున్నారు. రేషన్‌ దుకాణాల్లో నాణ్యమైన సరుకులు అందని పరిస్థితి.

అంగన్‌వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఆశ్రమాల్లో విద్యార్థులకు పెడుతున్న మెనూలో కూడా సరైన పోషకాహారాన్ని అందించలేకపోతున్నారు. ఏజెన్సీలోని కొన్ని మండలాల్లో గతంలో ఐటీడీఏ పోషకాహార కేంద్రాలను నిర్వహించినప్పటికీఇది కొన్నాళ్లకే పరిమితమైంది. గిరిజనుల ఆహార భద్రతపై నిర్ధిష్టమైన కార్యాచరణ ఐటీడీఏ చేపట్టలేదు.

దిగజారిన జీవన ప్రమాణాలు
మన్యంలో సుమారు 1.80 లక్షల గిరిజన కుటుంబాలు ఉన్నాయి. 3,574 గిరిజన గ్రామాల్లో గిరిజన జనాభా 6 లక్షలు దాటి ఉంది. సగానికి పైగా గ్రామాల్లో గిరిజన కుటుంబాలు ఆర్థిక సమస్యల కారణంగా పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. రోజుకు ఒకపూట అంబలి, ఒక పూట గంజి అన్నం తిని జీవనం సాగిస్తున్న గిరిజన కుటుంబాలు చాలా ఉన్నాయి. నిత్యవసర ధరలు అధికం కావడంతో పేద గిరిజన వర్గాల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి.

గుడ్లు, పాలు సరఫరా లేదు  
సంపంగి గరువు గ్రామంలో మినీ అంగన్‌వాడీ కేంద్రం ఉంది. ఇక్కడకు ప్రతి నెలా సరుకులు రావడం లేదు. ముఖ్యంగా గుడ్లు, పాలు సరఫరా సరిగ్గా లేదు. జనవరి నెలలో 8 రోజులే గుడ్లు ఇచ్చారు. ఈ నెలలో ఒక్క రోజు కూడా గుడ్డు అందివ్వలేదు. బాలింతలకు ఏడు నెలల వరకు పోషకాహారం ఇస్తున్నారు. కూరగాయలు, పాలు, గుడ్లు, పప్పు దినుసులకు కొరతగా ఉంది. ఎప్పుడైనా సంతకు వెళ్లినపుడే తెచ్చుకుంటాం.–మజ్జి ప్రమీల, సంపంగి గరువు గ్రామం

మరిన్ని వార్తలు