ప్రసవ వేదన.. నరకయాతన

8 Oct, 2018 07:32 IST|Sakshi
గర్భిణిని డోలీపై ఆస్పత్రికి తీసుకువస్తున్న కుటుంబ సభ్యులు

 డోలీపై గర్భిణి తరలింపు

ఐదు కిలోమీటర్లు మోసుకొచ్చిన కుటుంబ సభ్యులు  

విశాఖపట్నం, జీకే వీధి(పాడేరు): గిరిజనుల వైద్యం కోసం  కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని పాలకులు చెబుతున్నా ఆచరణలో ఎక్కడా  కనిపించడం లేదు. మన్యంలో చాలా గ్రామాల్లో రహదారి సౌకర్యం లేనందున కనీసం 108 వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి. దీంతో వ్యాధి గ్రస్తులు, గర్భిణులను డోలిమోతతో ఆస్పత్రులకు తరలించక తప్పడం లేదు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, గర్భిణులు నరకయాతన అనుభవిస్తున్నారు.   ఆదివారం గొందిపల్లి గ్రామానికి చెందిన ఓ   గర్భిణినికి ఇదే పరిస్థితి ఎదురైంది.

వివరాల్లోకి వెళితే.. మండలంలోని గొందిపల్లి గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. ఆ గ్రామానికి చెందిన కిల్లో దుర్గ పురిటినొప్పులతో బాధపడడంతో  కుటుంబ సభ్యులు ఐదు కిలోమీటర్ల దూరంలో గల  జీకే వీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డోలీ మోతతో  తీసుకువచ్చారు. సమయానికి తీసుకురావడంతో ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. గ్రామానికి రహదారి సౌకర్యం లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైన పాలకులు తమ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు