ప్రసవ వేదన

3 Mar, 2019 07:18 IST|Sakshi

రక్తంలో హిమోగ్లోబిన్‌(హెచ్‌బీ) శాతం 11 గ్రాముల కంటే తక్కువగా ఉంటే రక్తహీనత(అనీమియా)గా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సూచిస్తోంది. అనంతపురం సర్వజనాస్పత్రిలో  నెలకు 900 ప్రసవాలు జరుగుతుండగా.. అందులో 20 శాతం(7 గ్రాముల లోపు హెచ్‌బీ) తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇక 6 గ్రాముల హెచ్‌బీ ఉన్న కేసులు 25 శాతం వరకు నమోదువుతున్నాయి. 11 గ్రాముల హెచ్‌బీ కంటే తక్కువ ఉన్న కేసులు 60 నుంచి 70 శాతం ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన పోషకాహారం, వైద్య సలహాలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, పేదరికమే తల్లీబిడ్డల ప్రాణం మీదకు తెస్తున్నాయి. 

అనంతపురం న్యూసిటీ/సెంట్రల్‌ : మూఢనమ్మకాలు, పేదరికం, నిరక్ష్యరాస్యత...ఆచార వ్యవహారాలు గర్భిణులకు ప్రసవ వేదనను మిగిలిస్తున్నాయి. గర్భం దాల్చినప్పటి నుంచి మంచి పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నా.. వివిధ కారణాలతో చాలామంది మహిళలు దాన్ని పెద్దగా పాటించడం లేదు. ఫలితంగా రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు తమ కలల పంటను కళ్లచూడలేకపోతున్నారు. ఒక్కోసారి ప్రాణమ్మీదకు తెచ్చుకుంటున్నారు. మరోవైపు మాతాశివు మరణాలు అరికట్టేందుకు, సుఖ ప్రసవాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఈ క్రమంలో ఒక్క ఫిబ్రవరిలోనే అనంతపురంలోని సర్వజనాసుపత్రికి రక్తహీనత కేసులు 7 వచ్చినట్లు వైద్యులు తెలిపారు. 

రూ.కోట్లు ఖర్చుచేస్తున్నా....
ఓ వైపు వైద్య ఆరోగ్యశాఖ, మరో వైపు మహిళా,శిశు సంక్షేమశాఖల అధికారులు గ్రామ స్థాయి నుంచి మాతాశిశు మరణాలు అరికట్టేందుకు కృషి చేస్తున్నాయి. వైద్య ఆర్యోగశాఖ తరఫున నెలనెలా వైద్య పరీక్షలు, కావాల్సిన ఐరన్‌ మాత్రలు అందజేస్తున్నారు. మహిళా,శిశు సంక్షేమశాఖ ద్వారా రక్తహీనత నిర్మూలించేందుకు పౌష్టికాహారం(కోడిగుడ్డు, మధ్యాహ్న భోజనం) అందిస్తున్నారు. ప్రతి రోజూ బరువును చూసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇందుకోసం రూ.కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి బాలింత సమయం ముగిసే వరకూ యోగా క్షేమాలు పట్టించుకోవాల్సిన బాధ్యత గ్రామాల్లో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్, అంగన్‌వాడీవర్కర్లపై ఉంటుంది. అయినా కూడా రక్తహీనత కేసులు వస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

రక్తహీనత ఎందుకు వస్తుంది
రక్తహీనతో అనర్థాలెన్నో చోటు చేసుకుంటున్నాయి. ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, బీ–12, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్, కడుపులో నులిపురుగులు ఏర్పడడం కారణంగా రక్తహీనత వస్తుంది. రక్తహీనతతో విపరీతమైన అలుపు, ఆయాసం, కాళ్ల వాపులు వస్తాయి. కడుపులో బిడ్డ ఎదుగుదల ఉండదు. సిజేరియన్‌ సమయంలో అధిక రక్తస్రావమై తల్లీబిడ్డ ప్రాణాలకే ముప్పు. 

పెరుగుతున్న రక్తహీనత కేసులు
జిల్లాలో రక్తహీనత కేసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్‌ అధికారుల సమన్వయలోపం తల్లీబిడ్డలకు శాపంగా మారుతోంది. గడిచిన రెండేళ్లలో రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2017–18లో రక్తహీనత కేసులు 74.27 శాతం ఉండగా... 2018–19లో 71.89 శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అది మరింత ఎక్కువగా ఉన్నట్లు సర్వజనాస్పత్రిలోని గైనిక్‌ వైద్యులు చెబుతున్నారు. అందువల్లే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీసం 10 శాతం ప్రసవాలు జరగడం లేదంటున్నారు.

కొరవడిన పర్యవేక్షణ
గర్భం దాల్చినప్పటి నుంచి గర్భిణీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో పాటు ఐసీడీఎస్‌ సిబ్బంది గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించాలి. అయితే క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రక్తహీనత కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా యాంటినేటల్‌ చెకప్స్‌ చేస్తే హెచ్‌బీ, బీపీ సమస్యను తెలుసుకోవచ్చు. హైరిస్క్‌ కేసులను ముందుగానే గుర్తించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పోషకాహారం, వైద్య చికిత్సలు తీసుకునేలే చైతన్యం తీసుకురావచ్చు.

రక్తహీనతకు ఇలా చెక్‌
గర్భం దాల్చినప్పటి నుంచి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. అందుబాటులో ఉండే పండ్లు, ఆకుకూరలు, మాంసకృతులు తీసుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొదట వ్యక్తిగత శుభ్రత పాటించాలి. గోర్లు శుభ్రం తీసుకోవాలి. బాత్‌రూంకి వెళ్లిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. భోజనానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. లైంగిక శుభ్రత పాటించాలి. దీని ద్వారా యూరిన్‌ ఇన్‌ఫెక్షన్, నులిపురుగుల సమస్య ఉండదు. ఇక ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, బీ–12 లోపానికి పోషకవిలువలు అధికంగా ఉండే పప్పు, రాజ్మ, వేరశనక్కాయలు, బెల్లంతో చేసిన పాకంపప్పు, మునగాకు, వివిధ రకాల ఆకుకూరలు తీసుకోవాలి. దీని ద్వారా రక్తహీనత సమస్యకు చెక్‌ పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.. 

రక్తహీనత కేసులు అధికమే
సర్వజనాస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతల్లో 70 నుంచి 80 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కొందరికి హెచ్‌బీ మరీ 4 గ్రాములే ఉంటోంది. అలాంటి కేసులు నెలకు పదుల సంఖ్యలోనే వస్తున్నాయి. వీరు ఎలాంటి ఆహారం, వైద్య చికిత్సలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వారు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల వారు గుడ్డు తింటే పుట్టే బిడ్డలు వెంట్రుకల్లేకుండా పుడతారని భావించి చాలా మంది తినడం లేదు. ఇలాంటి మూఢనమ్మకాలు వీడేలా చైతన్యం తీసుకురావాలి.               
–డాక్టర్‌ సంధ్య, గైనిక్‌ –2 హెచ్‌ఓడీ, సర్వజనాస్పత్రి

పౌష్టికాహారం అందించేందుకు కృషి 
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత నివారించేందుకు కృషి చేస్తున్నాం. ‘అన్న అమృతహస్తం’ ద్వారా రోజూ మధ్యాహ్న భోజనం, కోడిగుడ్డు అందజేస్తున్నాం. దీంతో పాటు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాం. జిల్లాలో ఏఏ ప్రాంతాల్లో రక్తహీనత కేసులు నమోదవుతున్నాయో గుర్తించి.. ఆయా ప్రాంతాలల్లో ప్రత్యేక కార్యాచరణ ద్వారా రక్తహీనత నివారణ కోసం కృషి చేస్తాం.   
  – చిన్మయాదేవి, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌

అవగాహన కల్పిస్తున్నాం
గతంతో పోలిస్తే గర్భిణు, బాలింతలు, బాలికల్లో రక్తహీనత శాతం తగ్గింది. రక్తహీనతతో బాధపడేవారు గత ఏడాది 74 శాతం ఉంటే ఈ ఏడాది 71 శాతానికి వచ్చింది. పీహెచ్‌సీల్లో ప్రతి శుక్రవారం యాంటినేటల్‌ చెకప్స్‌తో పాటు మంచి పౌష్టికాహారం ఏర్పాటు చేస్తున్నాం. రక్తహీనత వల్లే కలిగే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. మాతా, శిశు మరణాల నివారణకు కృషి చేస్తున్నాం. 
– డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్‌(డీఎంహెచ్‌ఓ)

మరిన్ని వార్తలు