ఆ కడుపుకోతకు కారణమెవరు?

26 Feb, 2018 13:59 IST|Sakshi
బాలింత మృతితో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రి గేటు వద్ద ధర్నా చేస్తున్న బంధువులకు సర్దిచెబుతున్న గుడివాడ ఆర్డీవో

వైద్యుల నిర్లక్ష్యమా, ప్రభుత్వ వైఫల్యమా?

సౌకర్యాలు, వైద్యుల నియామకాలపై మొత్తుకుంటున్నా స్పందించిన మంత్రి

అరకొర వైద్యుల కారణంగా సీనియర్‌ రెసిడెంట్‌ సర్జరీలు

బాలింత మృతి వెనుక ఎన్నో కారణాలు

లబ్బీపేట (విజయవాడ తూర్పు): మెరుగైన వైద్యం అందుతుందని విజయవాడ  పాత ప్రభుత్వాస్పత్రికి వస్తే బాలింత ప్రాణాలే పోయాయి. వచ్చేటప్పటికీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నా ఆపరేషన్‌ చేసే సమయంలో పొరపాటు జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండవల్లి మండలం గున్ననపూడికి చెందిన వంగా చిట్టెమ్మ శస్త్రచికిత్సను సీనియర్‌ రెసిడెంట్‌ చేయడం వల్లే పొరపాటు జరిగిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంట్రా వాస్కులర్‌ ప్రాబ్లమ్‌తో పాటు యూరిన్‌ బ్లాడర్‌ కూడా దెబ్బతినడంతో అనుభవం లేని వైద్యురాలు చేయడం వల్లే అలా జరిగి ఉండవచ్చని నిపుణులు అంచనాకు వస్తున్నారు.

ఎస్‌ఆర్‌లకు బాధ్యత ఉంటుందా?
ఒక ఏడాది కంపల్సరీ సర్వీస్‌ చేసేందుకు వచ్చిన సీనియర్‌ రెసిడెంట్‌లు ఎంతవరకు బాధ్యతగా విధులు నిర్వహిస్తారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శాశ్వత వైðద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో ఎస్‌ఆర్‌లపై ఆధారపడక తప్పట్లేదు. దీంతో చిట్టెమ్మ లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రసూతి విభాగంలోనే కాకుండా అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సీనియర్‌ వైద్యులు చెబుతున్నారు. వారిపై ఆధారపడితే ఆస్పత్రి పరువు పోతుందంటున్నారు.

సూపరింటెండెంట్‌ సార్‌.. ఇప్పుడేమంటారు?
ఏడాది విధులు నిర్వహించి వెళ్లే వారిపై ఎలా ఆధారపడతామని, శాశ్వత వైద్యులు కావాలంటూ ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ప్రసూతి విభాగాధిపతి డాక్టర్‌ డి.రాజ్యలక్ష్మి కలెక్టర్‌ను కోరారు. తమ విభాగంలో తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుందని, అర్హత ఉన్న వైద్యులను నియమించాలన్నారు. ఈ సమయంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చక్రధర్‌ జోక్యం చేసుకుని ఎస్‌ఆర్‌లతో చేయించుకోవాలంటూ వితండవాదం చేశారు. కలెక్టర్‌ సాక్షిగా ఈ వాదన జరగ్గా, ఇప్పుడు ఎస్‌ఆర్‌ చేసిన సర్జరీ వికటించి బాలింత మృతిచెందగా, సూపరింటెండెంట్‌ ఏం సమాధానం చెబుతారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిరుపేదల జీవితాలతో ఆడుకోకుండా వైద్యులను నియమించాల్సిన అవసరం ఉంది.

వీఆర్‌ఎస్‌పై వెళ్లిన గత హెచ్‌వోడీ
తమ విభాగంలో తీవ్రమైన వైద్యుల కొరత ఉందని, సౌకర్యాలతో పాటు వైద్యుల సంఖ్య పెంచాలని ఆరోగ్యశాఖ మంత్రితో పాటు ఇతర అధికారులు మంత్రులతో జరిగిన సమావేశంలో గత హెచ్‌వోడీ ప్రాధేయపడ్డారు. ఆమె మొరను ఎవరూ ఆలకించలేదు. పైగా ఏదైన ఘటన జరిగితే వైద్యులనే నిందించడం ప్రారంభించారు. దీంతో ఇక్కడ చేయలేమని భావించిందో ఏమో వీఆర్‌పై వెళ్లిపోయింది. ఆమె వెళ్లి రెండేళ్లు గడస్తున్నా పరిస్థితిలో ఏమీ మార్పు రాలేదు. ఇప్పుడున్న వైద్యులు సైతం అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు.

అన్నీ చేశామంటారు.. ఇక్కడేం లేవు
ప్రభుత్వాస్పత్రులకు అన్నీ చేశాం.. నాలుగేళ్లలో కార్పొరేట్‌ స్థాయికి తీసుకెళ్లామని వైద్యమంత్రి తరచూ గొప్పలు చెప్పుకుంటారు. కానీ, ఇక్కడ పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉంది. పడకలు 90 నుంచి 240కు పెంచారు. పెరిగిన పడకలకు వైద్యులు, సిబ్బంది ఎక్కడ నుంచి వస్తారనే ఆలోచన చేయలేదు. నాలుగేళ్ల కిందటే ప్రస్తుతం ప్రసూతి విభాగంలో మూడు యూనిట్‌లు ఉండగా, ఆరు యూనిట్‌లు చేయాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ, దానిపై ఇప్పటికీ స్పందన లేదు. మరి నిరుపేదలకు మెరుగైన వైద్యం ఎక్కడి నుంచి అందుతుందని ప్రశ్నిస్తున్నారు.

ఒక్కరే అసిస్టెంట్‌.. పది సిజేరియన్‌లు
రోజూ సాయంత్రం 4 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ ఒక్క అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విధుల్లో ఉంటారు. ఆ సమయంలో పది సిజేరియన్‌లు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరో పది నుంచి పదిహేను సాధారణ డెలివరీలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి ఇద్దరికి చేయాలంటే ఎస్‌ఆర్‌లపై ఆధారపడక తప్పదు. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటే అలాంటి పరిస్థితి తలెత్తదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిపుణులైన వైద్యులు మరింత మందిని నియమించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు