డెలివర్రీ

25 Jun, 2018 09:03 IST|Sakshi
ప్రభుత్వ ఆస్పత్రి డెలివరికి వచ్చిన గర్భవతులు

కలగా మారిన ఎంసీహెచ్‌ బ్లాక్‌

అవస్థలు పడుతున్న గర్భిణీలు

పట్టించుకోని పాలకులు

అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రికి మెటర్నరీ చైల్డ్‌ హెల్త్‌ (ఎంసీహెచ్‌) బ్లాక్‌ ఏర్పాటు కలగా మారింది. 2013 నుంచి ఈ బ్లాక్‌ ఎప్పుడొస్తుందా అని ఆస్పత్రి వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇద్దరు కలెక్టర్లు ప్రభుత్వానికి విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో గర్భిణులు కటిక నేలపై పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పాలకులు చొరవ చూపితేనే ఎంసీహెచ్‌కు మోక్షం లభిస్తుందని ఆస్పత్రి వర్గాలంటున్నాయి.

ప్రతిపాదనలకే
ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. 2013లో అప్పటి కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ రూ.22 కోట్ల అంచనాతో 150 పడకల సామర్థ్యంతో బ్లాక్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిధులు సమకూరుస్తుందన్నారు. 2017లో కలెక్టర్‌ వీరపాండియన్‌ రూ. 55 కోట్లతో 350 పడకల సామర్థ్యంతో బ్లాక్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలమైన స్పందన లేదు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ఏనాడు దీనిపై చర్చించిన దాఖలాలు లేవు.

ప్రస్తుత  పరిస్థితి
ఆస్పత్రిలో ప్రసూతి వార్డుకు కేవలం 60 పడకలు మాత్రమే మంజూరయ్యాయి. కానీ ప్రస్తుతం 250 మంది గర్భిణీలు, బాలింతలు అడ్మిషన్‌లో ఉన్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రి యాజమాన్యం చిన్నపిల్లల వార్డును మూడో అంతస్తులోకి మార్చి, ఆ వార్డును గైనిక్‌ విభాగానికి అందజేసినా సమస్య తీరడం లేదు. ఆస్పత్రిలో రోజూ 30 ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన నెలకు 900 ప్రసవాలు జరుగుతున్నాయంటే గర్భిణీల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. గర్భిణీలు అధికంగా వస్తుండడంతో వైద్యులు, స్టాఫ్‌నర్సులు పని చేయడానికి నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా సిబ్బంది, పడకల కొరతతో రోగుల సహాయకులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఇక మెటర్నిటీ అసిస్టెంట్లు 12 మంది ఉండాల్సి ఉంటే ముగ్గురు మాత్రమే ఉన్నారు. దీంతో స్టాఫ్‌నర్సులే ఈ పనులు చేయాల్సి వస్తోంది.

బ్లాక్‌ ఏర్పాటైతే...
ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఏర్పాటైతే సగం సమస్య తీరినట్టేనని చెప్పాలి. వైద్యులు, స్టాఫ్‌నర్సులు, మెటర్నిటీ అసిస్టెంట్లు, నాల్గవ తరగతి ఉద్యోగులు వచ్చే అవకాశం ఉంది. కలెక్టర్‌ వీరపాండియన్‌ ఇందుకోసం ప్రతిపాదనలు పంపిన విషయం విధితమే. జీప్లస్‌ 3 భవనంలో ఒక్కో ఫ్లోర్‌కు రూ 22.4 కోట్లు అంచనా వేశారు. రూ 55 కోట్లలో సివిల్‌ పనులకు రూ 42 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ 9 కోట్లు, ఇతరత్ర సామాగ్రికి రూ 4 కోట్లు అంచనా వేశారు.

ఎదురుచూస్తున్నాం
ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఏర్పాటుకు డీఎంఈకు ప్రతిపాదనలు పంపాం. బ్లాక్‌ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నాం. వచ్చే నెలలో దీనిపై మరోసారి డీఎంఈను కలుస్తా. బ్లాక్‌ ఏర్పాటైతే మాతా,శిశు సేవలు మరింత మెరుగుపడుతాయి.– డాక్టర్‌ జగన్నాథ్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి

మరిన్ని వార్తలు