వైఎస్‌ఆర్‌సీపీలో చేరికకు సన్నాహాలు

26 Sep, 2013 04:02 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒకవైపు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ.. మరోవైపు జగన్ పునరాగమనం.. జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల ఉనికిని సవాల్ చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర విభజన విషయంలో పార్టీ అధిష్ఠానాల తీరుతో స్థానికంగా ఆ రెండు పార్టీల నేతలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో సమైక్యాంధ్ర నినాదంతో పోరాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ వైపు వారు దృష్టి సారిస్తున్నారు. ఇదే తరుణంలో బెయిల్‌పై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వచ్చిన సందర్భంగా వెల్లువెత్తిన అభిమానం, హైదరాబాద్‌లో జరిగిన ఊరేగింపులో పోటెత్తిన జనతరంగం నేతలను కుదురుగా ఉండనివ్వడంలేదు. వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న కృతనిశ్చయానికి వస్తున్నారు. వలసలతో పార్టీలోకి క్యూ కట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతూ ముహూర్తాలు నిర్ణయించుకుంటున్నారు.
 
 వలసల వరద
 కాంగ్రెస్, టీడీపీల నుంచి పెద్ద సంఖ్యలోనే వలసలు ఉండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమదాలవలస నియోజకవర్గంలో ఆ రెండు పార్టీల నుంచి వైఎస్‌ఆర్‌సీపీలో పెద్ద సంఖ్యలో చేరికకు రంగం సద్ధమైంది. వచ్చేనెల ఆరో తేదీని దీనికి ముహూర్తంగా నిర్ణయించారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం నాయకత్వంలో ఆరోజు సుమారు 20 వేల మందితో సభ నిర్వహించి కాంగ్రెస్, టీడీపీలకు చెందిన వారంతా వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నారు. ఇప్పటికే జిల్లాలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ రెండు పార్టీలను జనం తిరస్కరిస్తుండటంతో వాటి అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సమైక్య ఉద్యమంలో పాల్గొనేందుకు వెళుతున్న ఈ పార్టీల నేతలను జనం, సమైక్యవాదులు ఎక్కడికక్కడ అడ్డుకొని వెనక్కి పంపిస్తున్నారు. దీంతో వారికి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది.
 
 కుదేలైన కాంగ్రెస్
 ఇంతకాలం కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆ పార్టీకి దూరం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఆ పార్టీలోని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఆయన పార్టీపై అసహనంతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో కాంగ్రెస్ బతి కించిన తనపై నమోదైన కోర్టు కేసుల విషయంలో ప్రభుత్వం సహకరించడం లేదన్న అసంతృప్తి ఆయనలో బాగా ఉన్నట్లు తెలిసింది. కేసులు ఒక కొలిక్కి వచ్చే వరకు కాంగ్రెస్‌లోనే ఉండి, ఆ తరువాత గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే ప్రత్యామ్నాయంగా ఏ పార్టీలో చేరాలనే అంశంపై తన సన్నిహితులు, ముఖ్య కార్యకర్తలతో ధర్మాన చర్చించినట్లు తెలిసింది. వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని వారి లో ఎక్కువమంది సూచించడంతో ఆయన ఆలోచనలో పడినట్లు  తెలిసింది. విజ్ఞత కలిగిన రాజకీయ నాయకునిగా పేరున్న ధర్మాన వైఖరితో జిల్లాలో కాం గ్రెస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
 
 టీడీపీ కనుమరుగు
 ఇక జిల్లాలో టీడీపీ ఇప్పటికే నామమాత్రంగా మారింది. ఆ పార్టీలో ముఖ్య నాయకుల్లో ఒక్క రు కూడా మిగలలేదు. కొందరు రాజకీయంగా కనుమరుగై సొంత పనుల్లో నిమగ్నమయ్యారు.  ఎర్రన్నాయుడు మరణంతో పార్టీ కూడా నిర్జీవంగా మారిందని ఆ పార్టీకి చెందిన నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం ఉన్న కాస్త ఊపిరిని తీసేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు