పాదయాత్రకు చురుగ్గా ఏర్పాట్లు

4 Nov, 2017 08:29 IST|Sakshi
ఇడుపులపాయకు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు

సాక్షి,వేంపల్లె : ఇడుపులపాయలో ఈనెల 6వతేదీన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టబోయే పాదయాత్రకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇడుపులపాయకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌లో చక్రాయపేట మండల ఇన్‌చార్జి వైఎస్‌ కొండారెడ్డితో కలిసి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర రోడ్‌ మ్యాప్‌పై చర్చించారు. రోడ్‌ మ్యాప్‌ ప్రకారం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. 6న వైఎస్‌ఆర్‌ ఘాట్‌ నుంచి పాదయాత్ర చేపడతారని తెలిపారు. సోమవారం ఉదయం 11గంటలకు భారీ బహిరంగసభ ఉంటుందని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

పాదయాత్రలో భాగంగా లక్షమందికిపై కార్యకర్తలు, నాయకులు వస్తారని, అందుకు తగ్గట్లుగా భోజన వసతి, వాహనాల పార్కింగ్‌ తదితర వాటిపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ఇడుపులపాయలో భోజన వసతి ఉంటుందన్నారు. వీరన్నగట్టుపల్లె సర్కిల్‌ వద్ద వైఎస్సార్‌సీపీ జెండాను వైఎస్‌ జగన్‌ ఆవిష్కరిస్తారన్నారు. సాయంత్రం మాలవంక వద్ద బస చేస్తారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, నాయకులు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

భోజన వసతులపై పరిశీలన
వేంపల్లె : ఇడుపులపాయ నుంచి ఈనెల 6న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడికి వచ్చే వారందరికీ భోజన వసతుల ఏర్పాట్ల విషయమై పులివెందుల వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ మనోహర్‌రెడ్డి, చక్రాయపేట మండల ఇన్‌చార్జి వైఎస్‌ కొండారెడ్డిలు చర్చించారు. ఇడుపులపాయలోనే పలు చోట్ల వంట వసతులకు సంబంధించిన స్థలాలను పరిశీలించారు. భోజనాల విషయమై పులివెందులకు చెందిన బంగారు అంగడి నాగేష్, ఎల్‌ఐసీ సుబ్బారెడ్డి, చాగలేటి రాయుడు, యార్వ వెంకట సుబ్బయ్య, పబ్బతి వెంకట సుబ్బయ్య, వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. వివిధ రకాల వంటల తయారీకి సంబంధించిన అంశాలపై వారు చర్చించుకున్నారు.

మరిన్ని వార్తలు