ఎలాంటి త్యాగానికైనా సిద్ధం

18 Feb, 2018 01:42 IST|Sakshi

హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: చంద్రబాబు 

సాక్షి, అమరావతి బ్యూరో: ‘నా జీవితంలో రాజీపడను, తెలుగు జాతికి అన్యాయం జరిగితే ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా  నరసరావుపేట నియోజక వర్గంలో శనివారం మధ్యాహ్నం కోటప్పకొండలో ఆయన రోప్‌వే, టూరిజం కాంప్లెక్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నరసరావుపేట మండలం కాకానిలో  జేఎన్‌టీయూ భవనాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో  మాట్లాడారు.

నాడు హేతుబద్ధత లేకుండా విభజన చేశారన్నారు. రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకిస్తేనే ప్రత్యేక హోదా, ఇంకొన్ని అదనంగా ఇస్తామని చెప్పారని, మూడున్నరేళ్లు అయినా పూర్తి సహకారం అందలేదన్నారు.  రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు  గమనిస్తున్నారని తెలిపారు. మనం చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నామన్నారు. రాష్ట్రానికి మంచి చేయడంకోసం బిజెపీతో టీడీపీ పొత్తు పెట్టుకొందని పేర్కొన్నారు. ఇప్పటికి 29 సార్లు ఢిల్లీ వెళ్లి అందరినీ కలిసినా  సరైన న్యాయం జరగలేదని చెప్పారు.  పోరాటంలో వెనుకాడేది లేదని,  ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని చెప్పుకొచ్చారు..   

ప్రజలు ఆవేదనతో.. ఆవేశంలో ఉన్నారు..
తమకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలు ఆవేదనతో ఆవేశంలో ఉన్నారని చెప్పారు. విభజన నాటి తరహాలో మరలా ఉద్యమం తలెత్తే పరిస్థితి కనిపిస్తోందన్నారు. విభజన హామీలను తప్పక నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. తనకు రాజకీయాలు, వ్యక్తిగత అజెండాలు లేవన్నారు. అనేక సార్లు కేంద్రాన్ని కలిసి చెబుతున్నా న్యాయం జరగటం లేదని పేర్కొన్నారు. ఇంకా గట్టిగా అడగపోతే అన్యాయం జరుగుతుందంటూనే దీనిపై సున్నితంగా ఆలోచించాలన్నారు. ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారో లెక్కలు తేల్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.  కొంత మంది రాజకీయ ప్రయోజనం కోసం లాలూచీ పడి, వ్యక్తిగత ప్రయోజనాలకోసం  విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మన హక్కుల విషయంలో  ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొత్త ఉద్యోగాలన్నీ నాలెడ్జి ఎకానమీతోనే వస్తాయన్నారు.

మరిన్ని వార్తలు