ప్రజారోగ్యానికి పెద్దపీట

28 Aug, 2019 11:16 IST|Sakshi
మోడల్‌ ఆస్పత్రికి ఎంపికైన రామభద్రపురం పీహెచ్‌సీ

నియోజకవర్గానికి రెండు మోడల్‌ ఆస్పత్రులు

 సీఎం నిర్ణయంతో నివేదికలు సిద్ధం చేస్తున్న వైద్యశాఖ

 జిల్లాలోని ఆరు పీహెచ్‌సీలకు కొత్త భవనాలు

 ఆస్పత్రులకు ఆధునిక హంగులు

ఏపీహెచ్‌ఎంఐడీసీకి ప్రతిపాదనలు పంపిన జిల్లా వైద్యారోగ్య శాఖ

 డిసెంబర్‌ నుంచి పనుల ప్రారంభానికి చర్యలు 

సాక్షి, బొబ్బిలి: ప్రజా సంక్షేమ పథకాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, అవనీతి రహిత పాలన దిశగా సాగుతున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం... ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోంది. అందుబాటులో ఉన్న ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యసేవలందించాలని నిర్ణయించింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు నియోజకవర్గానికి రెండు ఆస్పత్రులను ఆధునిక హంగులతో ఆదర్శవంతగా తీర్చిదిద్దనున్నారు. రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గాల్లో మోడల్‌ ఆస్పత్రుల రూపకల్పనకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ కోవలోనే జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 18 పీహెచ్‌సీలకు భవనాలు, ఇతర సౌకర్యాలను సమకూర్చేందుకు ఏపీహెచ్‌ఎంఐడీసీకి జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు పంపించింది.

నియోజకవర్గానికి రెండు... 
రాష్ట్ర ప్రభుత్వం మొదట నియోజకవర్గానికి ఒక ఆస్పత్రిని అన్ని హంగులూ, సౌకర్యాలు కల్పిం చాలని నిర్ణయించింది. అయితే, ఉన్నతాధికారులతో సంప్రదించిన సీఎం నాయకత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం నియోజకవర్గానికి రెండు ఆస్పత్రులను ఎంపిక చేసి అక్కడి సౌకర్యాలను మెరుగు పర్చి మోడల్‌ ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని భావించింది. ఇందుకోసం రాష్ట్ర స్థాయి బృందం ఇటీవలే పర్యటించి ఆస్పత్రులను గుర్తించింది.

ఆరు ఆస్పత్రులకు కొత్త భవనాలు.. 
ఎంపిక చేసిన ఆస్పత్రులకు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో ఆరు పీహెచ్‌సీలను పూర్తిగా కొత్త భవనాలతో మార్పు చేయనున్నారు. అందులో తోణాం, మామిడి పల్లి, శం బర, మక్కువ, కొత్తవలస, చల్లపేట పీహెచ్‌సీలు ఉన్నాయి.ఈ భవనాలు పాత బడిపోవడంతో పా టు రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుందని వీటిని పూర్తి కొత్త భవనాలతో రూపొందించనున్నారు.

సకల సౌకర్యాలు.. 
మోడల్‌ ఆస్పత్రుల్లో తాగునీటితో పాటు ఫర్నిచర్, అధునాతన పరికరాలు, పరీక్షా పరికరాలు, ల్యాబ్‌లు, ప్రహరీలు, మందుల ప్రతిపాదనలు వంటి అన్ని సౌకర్యాలనూ కల్పించనున్నారు. జిల్లాలోని మొత్తం 62 పీహెచ్‌సీలను పరిశీలించిన అధికారుల బృందం 18 పీహెచ్‌సీలను గుర్తించి మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఒక్కో నియోజకవర్గానికి స్పెషల్‌ ఆఫీసర్‌.. 
ముందుగా నియోజకవర్గానికో స్పెషల్‌ ఆఫీసర్‌ను ప్రభుత్వం నియమించింది. వీరు ఆస్పత్రుల్లో సౌకర్యాలు, జ్వరాలపై పరిశీలనలు, ఏఏ ప్రాంతాల్లో ఏఏ రోగులున్నారు... ఎంత వరకు నివారిస్తున్నారన్న వివరాలను జిల్లా వైద్యాధికారికి నివేదిస్తారు. 

డిసెంబర్‌ నుంచి పనుల ప్రారంభం.. 
జిల్లాలో 9 నియోజకవర్గాల్లో రెండేసి మోడల్‌ ఆస్పత్రుల ఏర్పాటుకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా 18 పీహెచ్‌సీలను గుర్తించాం. అందులో ఆరు ఆ స్పత్రులకు కొత్త భవనాలు కూడా ప్రతిపాదించాం. డిసెంబర్‌ నాటికి పనుల ప్రారంభించే అవకాశం ఉంది.              
– డాక్టర్‌ కె.విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ, విజయనగరం  

మరిన్ని వార్తలు