ఎన్నికలకు సన్నద్ధం

28 Dec, 2014 00:52 IST|Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు
యూటీఎఫ్‌కు దీటుగా ఇతర అసోసియేషన్లు
మద్దతుపై మల్లగుల్లాలు పడుతున్న టీడీపీ నేతలు
జనవరి 16న విడుదల కానున్న ఓటర్ల తుది జాబితా

 
గుంటూరు  మార్చిలో జరుగనున్న కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపాధ్యాయ సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. గత ఎన్నికల్లో యుటీఎఫ్ క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆ యూనియన్ బలపరిచిన అభ్యర్థి లక్ష్మణరావు గెలుపునకు ప్రధాన కారణమైంది. ప్రస్తుత ఎన్నికలకు ఎస్టీయూ, పీఆర్‌టీయూ మరికొన్ని సంఘాలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.  వీటితోపాటు ప్రధాన రాజకీయ పార్టీలు ఉండనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈ ఆరునెలల్లో ప్రజల ఆశలను వమ్ము చేసింది. ఎన్నికల హామీల అమలుకు అనేక కొర్రీలు వేస్తుండటంతో టీడీపీ అసలు రంగును ప్రజలు గుర్తించారు. మేధావి వర్గానికి చెందిన ఉపాధ్యాయులు పార్టీ బలపరిచిన అభ్యర్థికి అనుకూలంగా తీర్పును ఇవ్వకపోతే దాని ప్రభావం పాలనపై పడే అవకాశాలు ఉన్నాయి.

నేడు టీడీపీ నేతల సమావేశం..

ఈ విషయాన్ని ముందే గుర్తించిన టీడీపీ నేతలు ఇప్పటి నుంచే ఉపాధ్యాయ సంఘాలతో సమాలోచనలు చేస్తున్నారు. ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయం తీసుకునేందుకు టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయమై ఆదివారం పార్టీ నాయకులు సమావేశం కానున్నారు. సంఘాలు బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా? పార్టీ నేరుగా అభ్యర్థిని బరిలోకి దింపాలా అనే విషయమై ఇంకా నిర్ణయానికి రాలేదు. జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవులు రానున్నాయి. వీటికోసం పార్టీలో అనేక మంది ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్నాయి. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని టీడీపీ నేతలు నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న కె.ఎస్.లక్ష్మణరావు పదవీ కాలం ఫిబ్రవరిలో ముగియనుంది. ఈ క్రమంలో ఆయన మరోసారి గెలవాలనే కాంక్షతో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. దీనిని గమనించి టీడీపీ అప్రమత్తమైంది. గత ఎన్నికల సమయానికి రెండు జిల్లాల పరిధిలో మొత్తం 12,850 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో గుంటూరులో 6,800 మంది, కృష్ణా జిల్లాలో 6,050 మంది ఓటర్లు ఉన్నారు. మార్చిలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇటీవల దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులతో కలిపి ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం జనవరి 5న విడుదల చేయనుంది.

అనంతరం జనవరి 16న తుది జాబితా విడదల చేయనున్నారు. 2009 నుంచి ఉద్యోగ విరమణ చేసిన వారితో కొన్ని ఓట్లు రద్దు కావడంతో పాటు, కొత్తగా చేరిన ఓటర్లతో కలుపుకుని 14 వేల మంది ఓటర్లు ఉండే అవకాశం ఉంది. యూటీఎఫ్ బలంతో గెలిచిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రస్తుతం యూటీఎఫ్, సీపీఎం పక్షాన అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాలనే లక్ష్యంతో గత కొద్ది నెలలుగా ఉపాధ్యాయులు, అధ్యాపకులతో మంతనాలు సాగిస్తున్నారు. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. పార్టీ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందని, అప్పటి వరకు దీనిపై దృష్టిని కేంద్రీకరించే అవకాశాలు లేవని ఆ పార్టీకి చెందిన జూపూడి రంగరాజు స్పష్టం చేశారు.
 
 

>
మరిన్ని వార్తలు