పన్ను ఎగవేసేందుకు ప్రయత్నాలు

3 Jun, 2014 01:29 IST|Sakshi

 నెల్లిమర్ల, న్యూస్‌లైన్: నెల్లిమర్ల నగర పంచాయతీ... ఏడాది కిందట ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రేడ్ 3 మున్సిపాలిటీ. నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ సరైన ఆదాయం లేక ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెల కొంది. ఏడాదికి ఇక్కడ అయ్యే వ్యయం సుమా రు 6 కోట్ల రూపాయలు అయితే ఆదాయం మాత్రం రూ.లక్షల్లోనే వస్తుంది. దీంతో నగర పంచాయతీగా ఏర్పాటైన నాటి నుంచీ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.

పోనీ అభివృద్ధి మాట అటుంచితే నగర పంచాయతీ పరిధిలో బడా సంస్థలు పన్ను సక్రమంగా చెల్లిస్తే కనీసం ఉద్యోగులకు వేతనాలైనా  సక్రమంగా ఇవ్వవచ్చని ఆశించారు. అయితే సదరు బడా సంస్థల యజమానులు మాత్రం పన్ను ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కోటి రూపాయలకు పైగా బకాయిలు వసూలు కాకుండా నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళితే నెల్లిమర్ల,జరజాపుపేట మేజర్ పంచాయతీలను కలిపి నగర పంచాయతీగా (గ్రేడ్ 3 మున్సిపాలిటీ) గత ఏడాది మార్చిలో ప్రభుత్వం మార్పుచేసిన సంగతి తెలిసిందే.
 
నగర పంచాయతీగా మార్పు చేసిన తరువాత శానిటేషన్, పరిపాలన సౌలభ్యం కోసం అప్పట్లో అధికారులు మరికొంతమంది సిబ్బందిని నియమించారు. ప్రతినెలా వీరందరికీ సుమారు రూ.5లక్షలు వేతనాలుగా చెల్లించాల్సి ఉంది. అయితే ఆదాయం అంతంత మాత్రంగా వస్తోం ది. దీంతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు సంవత్సర కాలంగా వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.  మిమ్స్ వైద్యకళాశాల, నెల్లిమర్ల జూట్‌మిల్లు, పారిశ్రామిక వాడలోని కొన్ని పరిశ్రమలు సక్రమంగా పన్ను చెల్లిస్తే వేతనాలు చెల్లించవచ్చని అధికారులు ఆశించారు. అయితే బడాసంస్థల యాజమాన్యాలు నగర పంచాయతీకి పన్ను ఎగవేసేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. ఆరునెలల నుంచి పన్ను చెల్లించాలని అధికారులు చెబుతున్నా వారు స్పందించడం లేదు.
 
వాస్తవానికి ఈ సంస్థలు గత ఏడాదికి సంబంధించి ఆస్తిపన్ను, బిల్డింగ్‌పన్ను వగైరా కలిపి కోటి రూపాయలకు పైగానే చెల్లించాల్సి ఉంది. మిమ్స్, జూట్‌మిల్లు రూ.39 లక్షల చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంది. మిగిలిన సంస్థలు కూడా మరో రూ 30 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం మారిపోవడంతో ప్రజాప్రతినిధులతో చెప్పించి పన్ను ఎగవేసేందుకు ఈ సంస్థ లు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నగర పం చాయతీ తిరిగి పంచాయతీగా మారిపోతుందని, అప్పుడు పన్ను ఎగవేయవచ్చునని ఆరాటపడుతున్నారు. ఒకవేళ పంచాయతీగా మారిపోయినా ఏడాది పాటు నగర పంచాయతీగానే ఉంది కాబట్టి ఎలాగైనా బకాయిలు చెల్లించక తప్పదని నగర పంచాయతీ అధికారులు అంటున్నారు.
 
ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇప్పటికైనా పన్నులు చెల్లించేలా ఒత్తిడి తీసుకు రావాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ విషయమై నగర పంచాయతీ కమిషనర్ శంకరరావు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ నగర పంచాయతీలోబడాసంస్థలు బకాయిలు పడినమాట వాస్తవమేనని, పన్ను చెల్లించాలని ఇప్పటికే పలుమార్లు కోరినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు