జాగ్రత్తలతోనే రాజధాని భద్రం

14 Oct, 2014 01:27 IST|Sakshi
జాగ్రత్తలతోనే రాజధాని భద్రం
 • పెను తుపాను వస్తే మన పరిస్థితి ఏమిటి!
 • విశాఖలో బీభత్సంతో జిల్లావాసుల ఆందోళన
 • ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర నష్టం తప్పదంటున్న నిపుణులు
 • గుణపాఠాలు నేర్వని పాలకులు
 • విపత్తులను తట్టుకునేలా రాజధాని నిర్మించాలని హితవు
 • సాక్షి, విజయవాడ: సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖ మహా నగరాన్ని హుదూద్ తుపాను అతలాకుతలం చేసింది. ప్రశాంతతకు మారుపేరైన సాగర నగరంలో అల్లకల్లోలం సృష్టించింది. ప్రస్తుతానికి మన జిల్లాకు ముప్పు  తప్పినా భవిష్యత్తులో ఇటువంటి ప్రకృతి బీభత్సకాండ ఎదురైతే పరిస్థితి ఏమిటీ.. నవ్యాంధ్ర రాజధాని బెజవాడ ఎలా తట్టుకుంటుంది.. అనే అంశంపై సర్వాత్రా చర్చ సాగుతోంది.

  గతంలో అనేక విపత్తులు సంభవించినా పాలకులు, ప్రజలు ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో హుదూద్ వంటి పెను తుపాను కృష్ణా జిల్లా తీరంలో కేంద్రీకృతమైతే 1977లో వచ్చిన దివీసీమ ఉప్పెన కన్నా తీవ్రమైన ఘోరకలి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీసం నూతన రాజధాని నగరాన్ని అయినా విపత్తులను తట్టుకునేలా సమగ్ర ప్రణాళికతో నిర్మించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. విజయవాడలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెను ప్రమాదాలను నివారించవచ్చని చెబుతున్నారు.
   
  ఇన్ని జరిగినా గుణపాఠాలు నేర్వరా...!

  విజయవాడ కృష్ణా నదిని ఆనుకుని ఉంది. జిల్లాలో 120 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీరం వెంబడి నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మోపిదేవి, మచిలీపట్నం, బంటుమిల్లి, కృతివెన్ను తదితర మండలాల పరిధిలోని 53 రెవెన్యూ గ్రామాలు, 130 శివారు గ్రామాల్లో 88,255 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వీరిలో అత్యధికంగా మత్స్యకా రులే ఉన్నారు. తుపాను వచ్చిన ప్రతిసారీ విజయవాడలోని కృష్ణా నది, బుడమేరు పక్కన నివసించేవారితోపాటు తీరప్రాంత వాసులు ఆస్తి నష్టపోతున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  1977లో దివిసీమ ఉప్పెన కారణంగా సుమారు లక్షన్నర మంది ప్రజలు చనిపోయారని అంచనా. అప్పట్లో సుమారు రూ.250 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. జనజీవనం సాధారణ స్థితికి రావడానికి ఏడాది పైగా పట్టింది. గత ఎడాది హెలెన్, లెహర్ తుపానుల వల్ల జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో రూ.200 కోట్ల విలువైన పంట నష్టం వాటిల్లింది. తీర ప్రాంతాల్లోని అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. 2008లో కృష్ణా నదీకి వరద రావడంతో విజయవాడలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. 13 లోతట్టు ప్రాంతాలు వారం రోజులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

  కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు పడవల ద్వారానే రాకపోకలు సాగించాల్సి వచ్చింది. మరోవైపు 13 డివిజన్లలో రెండు లక్షల మందికి పైగా కొండలపై ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. బుడమేరుకు వరద వస్తే రాజరాజేశ్వరీపేట, పాయకాపురం, ప్రకాష్‌నగర్, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. కృష్ణా నదికి వరదలు వచ్చిన ప్రతిసారి ఇక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు. అయినప్పటికీ మన పాలకులు ఇప్పటివరకు గుణపాఠం నేర్చుకోలేదు. ముప్పు నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు.
   
  ఇలా చేస్తే మేలు..
  నూతన రాజధానితోపాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇక నుంచి అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెను ముప్పును నివారించే అవకాశం ఉంది.
   
  భవన నిర్మాణాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. విపత్తులను తట్టుకునేలా ప్రమాణాలు పాటించాలి.
   
  ప్రమాణాల విషయంలో పరిశ్రమలు రాజీ పడకూడదు. ఎక్కువమంది ప్రజలు పనిచేసే సంస్థలు రక్షణ చర్యలు విధిగా పాటించాలి.
   
  డ్రెయినేజీ వ్యవస్థను పక్కాగా రూపొందించాలి.
   
  కరెంటు స్తంభాల స్థానంలో భూగర్భ లైన్లు ఏర్పాటుచేయాలి. దీనివల్ల స్తంభాలు కూలిపోయి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండదు.
   
  ఇదే తరహాలో టెలిఫోన్ కేబుల్ వ్యవస్థను కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తే మంచిది.
   
  సెల్‌ఫోన్ టవర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తే మేలు. సాధ్యమైనంత వరకు జనావాసాల మధ్య లేకుండా చూడాలి.
   
  హోర్డింగ్‌ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నాసిరకం ఇనుము వాడకుండా నిర్దేశిత ప్రమాణాలు పాటించేలా చూడాలి.
   
  కృష్ణా నది వెంబడి పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మించాలి.
   
  బుడమేరులో ఆక్రమణలను తొలగించి ఎప్పటికప్పుడు పూడిక తీయాలి. తద్వారా నీరు సక్రమంగా పారుతుంది. ముంపు సమస్య తొలగిపోతుంది.
   
  జిల్లాలోని తీర ప్రాంతాల్లో శాశ్వత తుపాను రక్షిత కేంద్రాలను నిర్మించి, వాటిని నిత్యం పర్యవేక్షిస్తుండాలి. తద్వారా విపత్తుల సమయంలో ప్రజలకు వీటిలో ఆశ్రయం కల్పించవచ్చు.
   
  ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు పాటించని సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహించే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విషయంలో ఉదాసీనంగా వ్యవహరించరాదు.  
   

మరిన్ని వార్తలు