26న రాష్ట్రపతి రాక

9 Dec, 2014 00:59 IST|Sakshi
26న రాష్ట్రపతి రాక

అయిభీమవరం (ఆకివీడు) : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ నెల 26న అయిభీమవరం రానున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంజీ గోపాల్ తెలిపారు. ఆకివీడు మండలం అయిభీమవరంలో వేద పాఠశాల నిర్మాణ పనులను సోమవారం గోపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.5 కోట్లతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల నూతన భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రపతి తొలుత వేద పాఠశాలలోని గోశాలకు వస్తారని, అక్కడి పుష్కరిణిని పరిశీలించి యాగశాలకు వెళతారని తెలిపారు. అనంతరం వేద పాఠశాల ప్రధాన భవనాన్ని ప్రారభించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. మొత్తంగా రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలు సుమారు 1.45 గంటలపాటు కొనసాగుతాయని చెప్పారు. ఆయన వెంట టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈవో పోల భాస్కర్, సీఈ చంద్రశేఖరరెడ్డి, ఈఈ డీవీ శ్రీహరి, డీఈఈ ఇ.రామకృష్ణ, వైదిక్ విభాగ్ పీవో విభీషణశర్మ, విద్యుత్ విభాగం ఎస్‌ఈ ఎ.వెంకటేశ్వర్లు, డీఈఈ ఇ.శ్రీనివాస్, ఆర్డీవో డి.పుష్పమణి తహ సిల్దార్ వి.నాగార్జునరెడ్డి ఉన్నారు.

ఏర్పాట్ల పరిశీలన
రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యూరు. నరసాపురం ఆర్‌డీవో డి.పుష్పమణి సోమవారం అయిభీమవరం వచ్చారు. పర్యటనకు సంబంధించిన అంశాలపై టీటీడీ ఈవో గోపాల్‌తో చర్చించిన ఆర్డీవో అనంతరం టీటీడీ మాజీ చైర్మన్ బాపిరాజుతో కలిసి హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. లయన్స్ ఆడిటోరియంకు ఎదురుగా ఉన్న స్థలం రాష్ట్రపతి, ఆయనతోపాటు వచ్చే మరో రెండు హెలికాప్టర్లు దిగేందుకు అనువుగా ఉంటుందని నిర్ధారించారు.
 

మరిన్ని వార్తలు