విజిలెన్స్‌ డీజీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ పతకం

26 Jan, 2020 03:51 IST|Sakshi
రాజేంద్రనాథ్‌రెడ్డి

విజయవాడ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సుధాకర్‌కు కూడా.. 

ఏపీకి రెండు ప్రెసిడెంట్‌ మెడల్స్, 15 పోలీస్‌ మెడల్స్‌ ప్రకటించిన కేంద్రం 

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి, విజయవాడ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) కొట్ర సుధాకర్‌లకు రాష్ట్రపతి పతకం (ప్రెసిడెంట్‌ మెడల్‌) దక్కింది. విశిష్ట సేవలు అందించినందుకుగాను వీరిద్దరు ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్స్‌ (పీపీఎం)కు, ప్రతిభావంతమైన సేవలు అందించినందుకు రాష్ట్రానికి చెందిన మరో 15 మంది పోలీస్‌ మెడల్స్‌(పీఎం)కు ఎంపికయ్యారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పోలీస్‌ విభాగాల్లో సేవలందించిన వారికి నాలుగు రకాల మెడల్స్‌ను ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ శనివారం జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రపతి పోలీస్‌ శౌర్య పతకం (పీపీఎంజీ–ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంటరీ)కి నలుగురు, పోలీస్‌ శౌర్య పతకం (పీఎంజీ)కి 286 మంది, రాష్ట్రపతి పోలీస్‌ పతకం (పీపీఎం)కి 93, పోలీస్‌ పతకం (పీఎం)కు 657 మంది పోలీసులు ఎంపికయ్యారు.  

పోలీసు మెడల్‌కు ఎంపికైన వారు వీరే.. 
అలాగే, ప్రతిభావంతమైన సేవలు అందించినందుకు రాష్ట్రానికి చెందిన 15 మంది పోలీస్‌ మెడల్‌ (పీఎం)కు ఎంపికయ్యారు. వారిలో విజయవాడ అదనపు ఎస్పీ అమలపూడి జోషి, మంగళగిరి ఏపీఎస్పీ అడిషనల్‌ కమాండెంట్‌ చింతలపూడి వీఏ రామకృష్ణ, విజయవాడ సీఐడీ డీఎస్పీ ఎం.భాస్కరరావు, విశాఖ గ్రేహౌండ్స్‌ అసాల్ట్‌ కమాండర్‌ విజయకుమార్, విజయవాడ రిజర్వ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జాన్‌మోజెస్‌ చిరంజీవి, నెల్లూరు ఏఆర్‌ ఎస్సై నన్న గౌరి శంకరుడు, అనకాపల్లి ఏఎస్సై విక్టోరియా రాణి, చిత్తూరు ఏఎస్సై కేఎన్‌ కేశవన్, అనంతపురం ఏఆర్‌ ఎస్సై ఎస్‌.రామచంద్రయ్య, ఒంగోలు హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రశేఖర్, విజయవాడ ఎస్‌ఐబీ హెడ్‌ కానిస్టేబుల్‌ విజయభాస్కర్, విజయనగరం ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌  రామకృష్ణరాజు, కర్నూలు పోలీస్‌ కానిస్టేబుల్‌ రామన్న, విశాఖ  రైల్వే పోలీస్‌ కానిస్టేబుల్‌ సూర్యనారాయణ, విశాఖపట్నం ఏసీబీ ఏఆర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎంవీ సత్యనారాయణరాజులు ఉన్నారు. మరోవైపు.. తెలంగాణా అడిషనల్‌ డీజీపీ (పర్సనల్‌) బి.శివధర్‌రెడ్డికి కూడా రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ట సేవా పతకం లభించింది. 12 మంది పోలీసు అధికారులకు ప్రతిభావంతమైన సేవా మెడల్స్‌ లభించాయి.  

ఏపీకి జీవన్‌ రక్షా పాదక్‌ అవార్డులు 
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ఆమోదం మేరకు ఇచ్చే జీవన్‌ రక్షా పాదక్‌ సిరీస్‌ అవార్డులనూ కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సర్వోత్తమ్‌ జీవన్‌ రక్షాపాదక్, ఉత్తమ్‌ జీవన్‌ రక్షాపాదక్, జీవన్‌రక్షా పాదక్‌ విభాగాల్లో అవార్డులు ప్రకటించింది. ఉత్తమ్‌ జీవన్‌ రక్షా పాదక్‌ విభాగంలో ఏపీ నుంచి మీసాల ఆనంద్‌కు, జీవన్‌ రక్షా పాదక్‌ విభాగంలోనూ ఏపీ నుంచి రాజేష్, ముఖేష్‌కుమార్‌లకు అవార్డు దక్కింది. అలాగే, అగ్నిమాపక విభాగంలో డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ చింతాడ కృపావరం, అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ బి.వీరభద్రరావులకు ఫైర్‌ సర్వీస్‌ మెడల్స్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకం లభించింది.  

డీజీపీ అభినందనలు
విధి నిర్వహణలో గొప్ప సేవలు అందించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రానికి చెందిన పలువురు పోలీసులకు కేంద్ర పతకాలు రావడంపట్ల ఆయన వారిని అభినందించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ యూనిట్లకు శనివారం ఆయన ఫ్యాక్స్‌ మెస్సేజ్‌ ఇచ్చారు. వీరు సాధించిన పతకాలు రాష్ట్రానికి, పోలీసు శాఖకు గర్వకారణమన్నారు.

రాజేంద్రనాథ్‌ విశిష్ట సేవలు
జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి తన 25 సంవత్సరాల సర్వీసులో అనేక సంచలనాత్మక కేసులను సమర్ధవంతంగా డీల్‌ చేశారు. ప్రధానంగా విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో చిన్నారి వైష్టవి దారుణ హత్యలో నిందితులను మూడ్రోజుల్లోనే పట్టుకున్నారు. అలాగే..
- విజయవాడ వన్‌టౌన్‌లో ఎప్పుడూ లేని విధంగా అప్పట్లో మతకలహాలు చోటు చేసుకోవడంతో అందులోని నిందితులను వెంటనే పట్టుకున్నారు. సంఘ విద్రోహులకు నగర బహిష్కరణ విధించారు. 
తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖుల విగ్రహాల ధ్వంసం కేసు.. నెల్లూరు జిల్లాలోని కేథలిక్‌ సిరియన్‌ బ్యాంకు దోపిడీ కేసు, డెకాయిట్ల ఆగడాలను నిలువరించడంలో విశేష ప్రతిభ కనబరిచారు.  
ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా వ్యవహరిస్తూ కీలకమైన కేసుల విచారణలో ముఖ్య భూమిక వహిస్తున్నారు. రాజధాని నిర్మాణం, ఇతర అక్రమాలకు సంబంధించిన కేసుల విచారణ ఇందులో ముఖ్యమైనవి. 

మరిన్ని వార్తలు