ఐపీఎస్లు సామాన్యులకు రక్షణ కల్పించాలి: ప్రణబ్

5 Nov, 2013 16:56 IST|Sakshi
ఐపీఎస్లు సామాన్యులకు రక్షణ కల్పించాలి: ప్రణబ్

హైదరాబాద్ : సామాన్యులకు రక్షణ కల్పించేలా ఐపీఎస్లు పని చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన శిక్షణ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్లో మంగళవారం ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ప్రణబ్  గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అంకితభావంతో శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులను అభినందిస్తున్నానని తెలిపారు. సామాన్యులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఐపీఎస్‌లు పని చేయాలన్నారు. ఐపీఎస్‌లు వృత్తి నిబద్ధతతో పని చేస్తారని ఆశిస్తున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు. వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావం కలిగి ఉండాలని సూచించారు. మతసామరస్యం కాపాడడంలో ఐపీఎస్‌లది కీలకపాత్ర అని తెలిపారు.

నిరంతరం ఉగ్రవాదులకు భారత్ లక్ష్యంగా మారుతోందని చెప్పారు. ఉగ్రవాదం, చొరబాటుదారులను ఆరికట్టడంలో భారత ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తోందన్నారు. జస్టిస్ వర్మ కమిటీ సూచనల మేరకు మహిళలపై వేధింపుల నివారణకు కొత్త చట్టం తెచ్చామని చెప్పారు. దేశంలో జరుగుతున్న సంఘ విద్రోహ చర్యలను అరికట్టాలని కోరారు.

రాష్ట్రపతి వెంట గవర్నర్ నరసింహన్ కూడా ఉన్నారు. 148 మంది ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకోగా, వారిలో ఏపీ కేడర్కు చెందినవారు ఎనిమిదిమంది ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రణబ్ రాజ్‌భవన్‌  చేరుకున్నారు. అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయాం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట 5 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

మరిన్ని వార్తలు