తిరుమలలో రాష్ట్రపతి కోవింద్‌

14 Jul, 2019 04:06 IST|Sakshi
తిరుచానూరు ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు. చిత్రంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తదితరులు

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న రామ్‌నాథ్‌ కోవింద్‌

రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్, సీఎం జగన్‌ సాదర స్వాగతం

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి దంపతులు

తిరుమల/రేణిగుంట(చిత్తూరు జిల్లా)/సాక్షి, అమరావతి: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. సతీమణి సవితా కోవింద్‌తో కలసి తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ దంపతులు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. శనివారం రాత్రికి రాష్ట్రపతి తిరుమలలోనే బస చేశారు. ఆదివారం ఉదయం వరాహస్వామి దర్శనానంతరం శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. రాష్ట్రపతికి ఇస్తికఫాల్‌ మర్యాదలతో శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీవారి దర్శనానంతరం రాష్ట్రపతి పద్మావతి అతిథిగృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరించాక తిరుగు ప్రయాణమవుతారు.

రేణిగుంటలో ఘన స్వాగతం.. : అంతకుముందు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి శనివారం సాయంత్రం 5.10 గంటలకు చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, సీఎస్‌ ఎల్‌వీ సుబ్రమణ్యం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు.
ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నవాజ్‌బాష, జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు, డీసీసీబీ చైర్మన్‌ సిద్దాగుంట సుధాకర్‌రెడ్డి, చిత్తూరు కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్త, డీఐజీ కాంతిరాణ టాటా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక వాహనశ్రేణిలో రోడ్డు మార్గాన తిరుచానూరుకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి తిరుపతిలోని కపిలేశ్వరస్వామిని దర్శించుకుని తిరుమలకు వెళ్లారు.


శనివారం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలుకుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో గవర్నర్‌ దంపతులు


రేణిగుంట విమానాశ్రయం లాంజ్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో ముచ్చటిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

మరిన్ని వార్తలు