ఖజానాలో డేంజర్‌ ‘బిల్స్‌’

26 Apr, 2019 03:52 IST|Sakshi

దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకుంటున్న పెదబాబు, చినబాబు

అస్మదీయ కాంట్రాక్టర్లకు  బిల్లులు వెంటనే చెల్లించాలని  ఆర్థిక శాఖపై ఒత్తిడి

ఉద్యోగులకు వేతనాలు  ఇవ్వకపోయినా   ఫరవాలేదంటున్నచంద్రబాబు, లోకేశ్‌ 

బిల్లులు చెల్లించిన వాటిపైకమీషన్లు కొట్టేసేందుకు ఎత్తుగడ

మంచినీటి సరఫరా, వెనుకబడిన, మహిళా, సాంఘిక సంక్షేమ శాఖల బిల్లులు పెండింగ్‌లోనే..

సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో పెదబాబు, చినబాబు నిమగ్నమయ్యారు. అధికారాంతమున ఖజానాను దోచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలింగ్‌ ముందు వరకూ తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించుకున్నాడు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులన్నీ చెల్లించాల్సిందేనంటూ ఆర్థిక శాఖపై ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో(సీఎంవో) సాగునీటి వ్యవహారాలను పర్యవేక్షించే సాయిప్రసాద్‌ ద్వారా ఆర్థిక శాఖపై ఒత్తిడి పెంచుతున్నారు. పోలింగ్‌ ముందు రోజు దాకా ప్రభుత్వ నిధులను రాజకీయ అవసరాలు, స్వీయ లబ్ధి కోసం యథేచ్ఛగా వాడుకున్న చంద్రబాబుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా(సీఎస్‌) ఎల్‌వీ సుబ్రహ్మణ్యం రావడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. పోలింగ్‌ ముందు వరకూ ఉద్యోగుల వేతనాలు, వివిధ సంక్షేమ రంగాలకు ఇవ్వాల్సిన బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌ పెట్టారు. చంద్రబాబు చెప్పిన బిల్లులకే నిధులను చెల్లించారు. ఉద్యోగుల వేతనాలు, గ్రామీణ మంచినీటి సరఫరా, కుటుంబ సంక్షేమం తదితర రంగాలకు చెందిన బిల్లులు పెద్ద ఎత్తున పెడింగ్‌లోనే ఉండిపోయాయి. ఈ బిల్లుల కోసం లబ్ధిదారులు ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. 

ప్రాధాన్యతా రంగాల వారీగా చెల్లించాలి 
వేతనాలు చెల్లింపులు జరగలేదనే విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్‌ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌) ద్వారా బిల్లుల చెల్లింపులు ప్రాధాన్యతా క్రమంలో జరగడం లేదని, ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికే చెల్లింపులు చేస్తున్నారనే ఫిర్యాదులు సీఎస్‌కు అందాయి. దీంతో సీఎస్‌ పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు తక్షణమే అందజేయాలని, ప్రాధాన్యతా రంగాల ప్రకారం బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపును ఆఖరి ప్రాధాన్యతగా సీఎస్‌ నిర్ధారించారు. ఇక్కడే చంద్రబాబు అహం దెబ్బతింది. అందుకే సీఎస్‌ తీరుపై ఆయన గుర్రుగా ఉన్నారు. బిల్లుల చెల్లింపులో చంద్రబాబు ప్రాధాన్యతలకు, ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ప్రాధాన్యతలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. 

కమీషన్లు ముట్టజెప్పిన వారికే బిల్లులు 
ఎన్నికల ముందు కమీషన్లు కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై ఒత్తిడి తెచ్చి నీరు–చెట్టు కింద రూ.2,104 కోట్ల బిల్లులు చెల్లింపజేశారు. ఆ నిధులన్నీ అధికార టీడీపీ నేతల జేబుల్లోకే వెళ్లాయి. అలాగే ఎన్నికల ముందు హడావిడిగా గోదావరి–పెన్నా ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానించి మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద కాంట్రాక్టర్‌కు రూ.491 కోట్లు ఇప్పించారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్, హంద్రీ–నీవా, గాలేరు–నగరి పనులకు సంబంధించి కాంట్రాక్టర్, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.419 కోట్లు ఇప్పించారు. నీరు–చెట్టుతో పాటు వివిధ ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన రూ.వేల కోట్ల బిల్లులను చెల్లించి, కమీషన్లు కాజేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తగినట్లుగా మార్చి నెలాఖరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి చెందిన నీరు–చెట్టుతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులకు చెందిన రూ.9,804.27 కోట్ల బిల్లులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకి సీఎఫ్‌ఎంఎస్‌ పరిధిలోకి తెచ్చారు. మిగతా రంగాలకు చెందిన బిల్లులను ఆర్థిక సంవత్సరం మారిందని తిరస్కరించినప్పటికీ అస్మదీయ కాంట్రాక్టర్లకు చెందిన బిల్లులను మాత్రం కొత్త ఆర్థిక సంవత్సరంలోకి పెండింగ్‌ బిల్లులుగా తీసుకొచ్చారు. 

పెదబాబుతో చినబాబు పోటీ 
కమీషన్లు కాజేసే విషయంలో చంద్రబాబుతో ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ పోటీపడుతున్నారు. పంచాయతీల్లో ఎల్‌ఈడీ బల్బుల బిల్లులను వెంటనే చెల్లించాలంటూ పంచాయతీరాజ్‌ శాఖపై ఒత్తిడి పెంచేశారు. గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ వీధి లైట్ల ఏర్పాటును ఈఈఎస్‌ఎల్, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ అనే ఏజెన్సీలకు అప్పగించారు. ఆ ఏజెన్సీల నుంచి లోకేశ్‌ మనుషులు సబ్‌ కాంట్రాక్టులు తీసుకున్నారు. సంబంధిత బిల్లులను వచ్చే నెల 5వ తేదీలోగా చెల్లించేయాలని పంచాయతీరాజ్‌ శాఖను లోకేశ్‌ ఆదేశించారు. అయితే, నిధుల్లేక పంచాయతీలు ఇప్పటికే సతమతం అవుతున్నాయి. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి చెందిన రూ.768 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వేసవిలో మంచినీటి ఎద్దడి ఉన్నప్పటికీ గ్రామీణ మంచినీటి సరఫరాకు చెందిన రూ.206.97 కోట్ల బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. మహిళా సంక్షేమానికి చెందిన రూ.132.93 కోట్లు, సాంఘిక సంక్షేమానికి చెందిన రూ.260.90 కోట్లు, గిరిజన సంక్షేమానికి చెందిన రూ.161 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు