విశాఖ కలెక్టర్‌పై ఒత్తిళ్లు!

9 Jun, 2017 08:45 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భూకుంభకోణంపై విశాఖ జాయింట్‌ కలెక్టర్‌ సృజనతో విచారణ చేయిస్తున్నట్టు ప్రకటించిన కలెక్టర్‌..  విచారణ పూర్తికాకుండానే కొమ్మాదిలో 13.79 ఎకరాలు మాత్రమే కబ్జాకు గురయ్యాయని.. 178.06 ఎకరాలకు చెందిన 1బి రికార్డులు మాత్రమే ట్యాంపరింగ్‌కు గురైనట్టుగా చెప్పడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ పూర్తికాకుండానే కబ్జాలపై కలెక్టర్‌ ఎందుకు తొందరపాటు ప్రకటన చేశారన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి.

పైగా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో రికార్డులకు సంబంధించి  అవకతవకలు జరగలేదని ప్రకటించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు బలంగా పనిచేశాయని అంటున్నారు. విశాఖ రూరల్‌లో ఎక్కడా అవకతవకలు, భూకబ్జాలు జరగలేదని మీడియా సమావేశంలో కలెక్టర్‌ ప్రకటించడం సందేహాలకు తావిస్తోంది. ఇక విశాఖ పరిసర మండలాల్లోనే కాదు.. గ్రామీణ మండలాల్లో కూడా ఎక్కడా రికార్డుల ట్యాంపరింగ్‌ జరగలేదని కలెక్టర్‌ చెబుతుండడం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి.
 

మరిన్ని వార్తలు