ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట

3 Dec, 2019 04:18 IST|Sakshi

సత్ఫలితాలిస్తున్న కొత్త ఇసుక పాలసీ  

వాహనాల కదలికలపై కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షణ 

చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలతో తనిఖీ 

పారదర్శకంగా ఇసుక బుకింగ్, సరఫరా 

డిసెంబర్‌ 1 వరకూ 23.81 లక్షల టన్నుల సరఫరా  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రీచ్‌లు, చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘాతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టపడింది. సీసీ కెమెరాల నిఘాతో పాటు టాస్క్‌ఫోర్సు దాడులు ముమ్మరం చేయడంతో అక్రమార్కుల వెన్నుల్లో వణుకు పుడుతోంది. మరోవైపు ఇంటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా ఇసుక బుక్‌ చేసుకునేలా పారదర్శక విధానంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బుక్‌ చేసుకున్న వారికి వెంటనే సమీపంలోని స్టాక్‌ యార్డులు, డిపోల నుంచి ఇసుక వెంటనే సరఫరా చేయడంతో అన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలకు సరసమైన ధరలకు ఇసుక అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

డిసెంబరు 1 వరకూ ఈ విధానంలో రాష్ట్రంలో మొత్తం 23,81,716 టన్నుల ఇసుకను ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సరఫరా చేసింది. ఇందులో బల్క్‌ వినియోగదారులు 3,88,955 టన్నులు, సాధారణ వినియోగదారులు 19,92,761 టన్నుల ఇసుకను కొనుగోలు చేశారు.  గత 20 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార తదితర నదులకు వరద రావడంతో నవంబరు రెండో వారం ముగిసే వరకూ రీచ్‌లన్నీ నీటిలోనే మునిగిఉన్నాయి. దీంతో ఇసుక తవ్వకాలు, రవాణాకు అవరోధం ఏర్పడడంతో కొంత మేర ఇసుక కొరత ఏర్పడింది. గత నెల రెండోవారం తర్వాత వరద తగ్గడం, నవంబరు 14 నుంచి ఇసుక వారోత్సవాలను నిర్వహించి చర్యలు తీసుకోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత నెల 16 నుంచి రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత మాటే లేదు. అన్ని డిపోలు, స్టాక్‌ పాయింట్లలో ఇసుక నిండుగా ఉంది.  

ప.గోదావరి జిల్లాలో అత్యధిక వినియోగం: పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా సాధారణ వినియోగదారులు 4,54,354 టన్నుల ఇసుకను కొనుగోలు చేయగా.. విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 14,766 టన్నుల ఇసుక మాత్రమే బుక్‌ చేసుకున్నారు. 

ఒకేరోజు 5 జిల్లాల్లో టాస్క్‌ఫోర్సు దాడులు  
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపుతూ.. అక్రమార్కులకు రూ. 2 లక్షల జరిమానాతోపాటు రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా జీఓ జారీ చేసింది. జీపీఎస్‌ పరికరాలు అమర్చిన వాహనాలను మాత్రమే ఇసుక సరఫరాకు అనుమతిస్తున్నారు. విజయవాడలోని కంట్రోల్‌ రూమ్‌ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు టాస్క్‌ఫోర్సు సిబ్బంది దాడుల్ని ముమ్మరం చేసింది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అనంతపురం, విజయనగరం, గుంటూరు, పశ్చిమగోదావరి,  విశాఖ జిల్లాల్లో విస్తృతంగా దాడులు చేసి కేసులు నమోదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న వారిపై 9, అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిపై 2 కేసులు నమోదు చేయడంతోపాటు 9 వాహనాలను సీజ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు