స్మగ్లింగ్‌ను అరికట్టాలి

1 Jul, 2014 02:41 IST|Sakshi
స్మగ్లింగ్‌ను అరికట్టాలి
  •     సీజ్ చేసిన ఎర్రచందనాన్ని వేలం వేయాలి
  •      ఫారెస్ట్, పోలీసు అధికారులతో డీజీపీ సమీక్ష
  • తిరుపతి క్రైం: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను సమూలంగా అరికట్టేందుకు అధునాతన ఆయుధాలను ఫారెస్టు అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ.రాముడు సూచించారు. పోలీస్ అతిథి గృహంలో వైఎస్‌ఆర్, చిత్తూరు, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీలు, ఫారెస్ట్ కన్సర్వేటర్, డీఎఫ్‌వోలు, పోలీసు అధికారులతో సోమవారం రాత్రి డీజీపీ జేవీ.రాముడు ఎర్రచందనం స్మగ్లిం గును అరికట్టే విషయంపై సుదీర్ఘంగా సమీక్షించారు.

    అడవిని పరిరక్షించాల్సిన బాధ్యత ఫారెస్టు అధికారులదేనని, ఫారెస్టు అధికారులు, పోలీసులు సమన్వయంతో పని చేసి స్మగ్లింగ్‌ను అరికట్టాల్సి ఉందన్నారు. ఎర్రచందనం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని వేలం వేసి ప్ర భుత్వానికి ఆదాయం చేకూర్చేలా దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఎర్రచందనం వేలం వేయడం ద్వారా మార్కెట్లో దాని డిమాండ్ తగ్గి స్మగ్లింగ్ తగ్గడానికి అవకాశముందన్నారు. సిబ్బంది కొరత, అటవీ శాఖ ను ఎంతో కాలంగా పీడిస్తోందని ఫారెస్టు అధికారు లు డీజీపీకి వివరించారు.

    ఇటీవల తిరుమల అడవుల్లో ఇద్దరు ఫారెస్టు అధికారులను స్మగ్లర్లు హత్య చేయడం, పోలీసు, ఫారెస్టు అధికారులపై స్మగ్లర్లు దాడు లు చేయడం వంటి వివరాలను ఫారెస్టు అధికారులు డీజీపీకి వివరించారు. ఇప్పటివరకు ఎన్ని కేసులు నమో దు చేశారు. ఎంత మందిని అరెస్టు చేశారు. స్మగ్లర్లపై పీడీ యాక్టు కేసులు నమోదు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శేషాచల అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా పెట్టి స్మగ్లర్లను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉం దని డీజీపీ సూచించారు. ఎస్పీలు అశోక్‌కుమార్ (కడప), రాజశేఖర్‌బాబు (తిరుపతి), రామకృష్ణ (చిత్తూరు) పాల్గొన్నారు.
     
    ఏపీ పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం
     
    ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థను పక్కా ప్రణాళికతో మరింత పటిష్టం చేస్తామని డీజీపీ జేవీ.రాముడు తెలిపారు. సోమవారం తిరుపతిలోని పోలీస్ అతిథిగృహంలో నూతనంగా తయారు చేసిన కాన్ఫరెన్స్ హాల్‌ను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు జేవీ.రాముడు, పద్మజ దంపతులు ఏఆర్ పెరేడ్ గ్రౌం డులోని చిల్డ్రన్స్ పార్క్‌ను ప్రారంభించారు.  ఆయన మాట్లాడుతూ తిరుమలలో టీటీడీ, పోలీసుల మధ్య ఎలాంటి ఆధిపత్యపోరు లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల యూనిఫాం డ్రస్‌కోడ్ మార్చే ఉద్దేశంలేదన్నారు.

    తిరుమలలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతా మన్నారు. రాయలసీమ రేంజ్ ఇన్‌చార్జ్ డీఐజీ వీవీ. వేణుగోపాలకృష్ణ, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ, చిత్తూరు, తిరుపతి అర్బన్, వైఎస్‌ఆర్ జిల్లా ఎస్పీలు రామకృష్ణ, ఎస్వీ.రాజశేఖర్‌బాబు, అశోక్‌కుమార్, ఓఎస్‌డీలు చాందేనాయక్, రాజశేఖర్‌రావు, సిద్దారెడ్డి డీఎస్పీలు టంగుటూరి సుబ్బన్న, రవిశంకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాసులు, ఎంవీయస్ స్వామి ఏఆర్ డీఎస్పీ ఇలియాస్ బాషా, సీఐలు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు