ప్రాణాలు పోతున్నా వినరే...

31 May, 2018 12:21 IST|Sakshi

కేజీహెచ్‌కు వెళ్లేందుకు ససేమిరా అన్న గర్భిణి

వైద్యసిబ్బంది ప్రాధేయపడినా నిరాకరణ

ఆర్థికసాయం చేస్తామన్నా అంగీకరించని వైనం

గూడెంకొత్తవీధి(పాడేరు): మన్యంలో మాతాశిశు మరణాలను అరికట్టాలని వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాలు గిరిజనుల అవగాహన లోపం కారణంగా సఫలం కావడం లేదు. ఏదో ఒక చోట మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. గిరిజనుల్లో అవగాహనలోపం అధికారుల సహనానికి పరీక్షగా మారుతోంది. తాజా ఓ గర్భిణి వైద్య సిబ్బందికి మూడు చెరువుల నీళ్లు తాగించింది. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు   వివరాల్లోకి వేళ్తే... మండలంలోని వంచుల పంచాయతీ సీహెచ్‌ చరపల్లి గ్రామానికి చెందిన సూకూరు విమలమ్మ   ఎనిమిది నెలల గర్భిణి. ఈమె ఎనిమియాతో బాధపడుతోంది. కొద్ది రోజులు క్రితం కేజీహెచ్‌లో వైద్యసేవలు పొందేందుకు వెళ్లింది. అక్కడ రెండు గ్రాములు రక్తం ఎక్కించారు. అక్కడ నుంచి ఎవరికి చెప్పకుండా స్వగ్రామానికి   వచ్చేసింది.

దీంతో ఆర్‌వీ నగర్‌ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది చరపల్లి వెళ్లి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఆమెకు మూడు గ్రాముల రక్తం మాత్రమే ఉండడంతో కేజీహెచ్‌కు తీసుకువెళ్లేందకు సిబ్బంది ప్రయత్నించారు.ఇందుకు విమలమ్మ ససేమిరా అనడంతో వైద్యసిబ్బంది తలలు పట్టుకున్నారు. గతంలో కేజీహె చ్‌కు వెళ్లి వారం రోజులు ఉన్నామని రెండు ప్యాకెట్ల రక్తం ఎక్కించారని, వారం రోజులు పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, మళ్లీ కేజీహెచ్‌కు వెళ్లి బాధలు పడలేమని భర్త కొత్తన్న తెలిపారు. ఈమెకు ఇద్దరు పిల్లలుకూడా చిన్నవయసు కావడంతో వైద్యానికి సిబ్బంది ఎంత ప్రాధేయపడినా అంగీకరించలేదు. దీంతో  ఆర్థికంగా సాయం చేసేందుకు సిబ్బంది ముందుకు వచ్చారు. అయినా వినకపోవడంతో  చేసేదిలేక వెనదిరగక తప్పలేదు.ఈ విషయాన్ని వైద్యా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు తెలియజేశారు.కేజీహెచ్‌కు వెళ్లాలని విమలమ్మను ప్రాధేయపడుతున్న వైద్య సిబ్బంది 099

మరిన్ని వార్తలు