ధర మురిగి.. గుండె పగిలి

11 Sep, 2014 00:30 IST|Sakshi
ధర మురిగి.. గుండె పగిలి

కోసిగి మండలం సజ్జలగుడ్డం గ్రామానికి చెందిన తమ్మారెడ్డి(35) తనకున్న ఆరెకరాల్లో రూ.2.30 లక్షల పెట్టుబడితో ఉల్లి, పత్తి, వేరుశనగ పంటలు సాగు చేశాడు. మూడు రోజుల క్రితం 280 ప్యాకెట్ల ఉల్లి దిగుబడిని కర్నూలు మార్కెట్‌లో విక్రయానికి పెట్టాడు. అనామత్ కొనుగోళ్ల కారణంగా ప్యాకెట్ ధర రూ.250 మాత్రమే పలకడంతో మనస్తాపం చెందాడు. దిగుబడులను మార్కెట్‌లోనే వదిలేసి వెళ్లాడు. ఈనెల 8న పంటల కోసం తెచ్చిన పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు:
 ఉల్లి రైతు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. గత ఏడాది మురిపించిన ఈ పంట.. ప్రస్తుతం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో అధిక శాతం దిగుబడులు పొలాల్లోనే మురిగిపోగా.. మిగిలిన సరుకు మార్కెట్‌లో విక్రయానికి పెట్టగా అనామత్ కొనుగోళ్ల రూపంలో ధర వెక్కిరిస్తోంది. ఇదే సమయంలో వ్యాపారులు.. హమాలీలు.. లారీ ఓనర్లు.. ట్రాన్స్‌పోర్టర్ల మధ్య వివాదాలతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికారులకు తెలిసినా అప్పటికప్పుడు హెచ్చరికలు చేసి వదిలేయడం పరిపాటిగా మారింది. ఫలితంగా రేయింబవళ్లు కష్టించినా.. మార్కెట్‌లో ఎదురవుతున్న పరిస్థితులతో మట్టి మనిషి చివరకు తనువు చాలించే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో ఉల్లి సాధారణ సాగు 16,904 హెక్టార్లు కాగా.. 20,161 హెక్టార్లలో సాగయింది. వర్షాభావ పరిస్థితుల
 కారణంగా అతి కష్టం మీద పంటలను గట్టెక్కించారు. సాధారణంగా దిగుబడలు తగ్గినప్పుడు ధర పెరగాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రోజురోజుకు ధర తగ్గుముఖం పడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే సమయంలో లారీ ఓనర్ల అసోసియేషన్, లారీ ట్రాన్స్‌పోర్టు(బ్రోకర్లు) అసోసియేషన్ల మధ్య వివాదం చెలరేగడం వారికి శాపంగా మారింది. మార్కెట్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లి రవాణాకు తమ లారీలనే వినియోగించాలని ఓనర్లు బ్రోకర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. బాడుగ అడిగినంత ఇవ్వాలనే డిమాండ్ విధించారు. దీంతో కొద్ది రోజుల పాటు వ్యాపారులు ఉల్లి కొనుగోళ్లు నిలిపేశారు. సమస్య పరిష్కారానికి అధికారులు, వ్యాపారులు ఓ కమిటీ వేసి మార్కెట్ ధరలకు అనుగుణంగా బాడుగలు నిర్ణయించేలా తీర్మానించారు. అయితే అమలుకు నోచుకోలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు హమాలీలు, వ్యాపారుల మధ్య కూలి విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ పరిణామం కూడా ఉల్లి రైతుపై ప్రభావం చూపింది.
 కొంప ముంచుతున్న అనామత్ వ్యాపారం
 ఉల్లి విక్రయాలకు తాడేపల్లిగూడెం తర్వాత కర్నూలు మార్కెట్‌యార్డు రాయలసీమ, మహబూబ్‌నగర్, ప్రకాశం జిల్లాలకు ఏకైక దిక్కు. ఇక్కడ అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా వ్యాపారుల తీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. అనామత్ కొనుగోళ్ల కారణంగా రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం క్వింటాకు రూ.1500 నుంచి రూ.2వేల ధర లభిస్తేనే రైతుకు గిట్టుబాటవుతుంది. అయితే వ్యాపారులు కుమ్మక్కై క్వింటా రూ.800లకు మించి కొనుగోలు చేయకపోవడం రైతులను ఆత్మహత్యలకు ఉసిగొలుపుతోంది. నిబంధనల ప్రకారం వేలంలో కొనుగోలు చేయాల్సి ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు. మధ్యాహ్నం వరకు నామమాత్రంగా వేలంలో కొనుగోలు చేస్తూ.. ఆ తర్వాత షరామామూలుగా అనామత్ వ్యాపారం సాగిస్తున్నారు. జిల్లా అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.వానొస్తే అంతే సంగతి కర్నూలు మార్కెట్ యార్డుకు కొద్ది రోజులుగా ఉల్లి దిగుబడి భారీగా వస్తోంది. అయితే అవసరమైనన్ని షెడ్లు లేకపోవడంతో ఆరుబయటే ఉంచాల్సి వస్తోంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దిగుబడులు తడిసి ముద్దవుతున్నాయి. ఇలాంటి సరుకు ధర సగానికి పడిపోతోంది. ఇదే సమయంలో పందికొక్కుల బెడద నష్టాన్ని రెట్టింపు చేస్తోంది.
 

>
మరిన్ని వార్తలు