ధాన్యం ధరకు రెక్కలు

10 Sep, 2015 03:29 IST|Sakshi
ధాన్యం ధరకు రెక్కలు

- వరి విస్తీర్ణం తగ్గుదల ప్రభావం
- బియ్యం ధరల్లో మార్పు రాని వైనం
తెనాలి :
ధాన్యం ధరకు రెక్కలొచ్చాయి. జిల్లాలో ఈ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుండటం చిత్రమైతే, ఆటోమేటిగ్గా పెరగాల్సిన బియ్యం ధరలో మార్పులేకపోవం మరో విచిత్రం. కృష్ణాడెల్టాలో వరి సాగు విస్తీర్ణం సగానికి పడిపోవటం ధాన్యం ధరల్లో ప్రభావం చూపింది. ఏదేమైనా గడప దాటాక పెరిగిన ధరలతో రైతులు ఎప్పుడూ దగాపడుతూనే ఉన్నారు. ఈ సారి నిల్వలు కూడా లేనందున మిల్లర్లకూ పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. దీనిని కృత్రిమ కొరతగా పేర్కొంటున్నారు.
 
వర్షాభావం, జలాశయాలు అడుగంటటంతో 2015-16 ఖరీఫ్ సీజను అన్నదాతకు సంకటంగా మారింది. నారుమళ్లుపోసి, వరినాట్లు వేసే రైతన్నలు ఈసారి అవకాశం లేక పెద్ద ఎత్తున వెద పద్ధతినే ఆశ్రయించారు.  కృష్ణా డెల్టా పరిధిలోని 13.07 లక్షల ఎకరాల ఆయకట్టులో ఆగస్టు నెలాఖరుకు కేవలం 6.60 లక్షల ఎకరాల్లోనే పంట వేశారు. ఇంకా 6.47 లక్షల ఎకరాల్లో వరి సాగు ప్రశ్నార్ధకమైంది. ఇప్పటికీ వర్షాలు తగినంతగా లేవు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతోనే ఆల్మటి, తుంగభద్ర, జూరాల నుంచి నీరు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు నిండుతాయన్నది తెలిసిందే.
 
చాపకింద నీరులా ధాన్యం ధరలు పెరగసాగాయి. గత సీజనులో వరిధాన్యం కల్లాల్లో ఉండగా, 76 కిలోల బస్తా రూ.1050-1100 అమ్ముకున్న రైతులున్నారు. తర్వాత రూ.1250-1300 మధ్య నడిచింది. గత జూన్/జులైలో అదే ధాన్యం బస్తా రూ.1625-1650 మధ్య అమ్మకాలు జరిగాయి. పదిరోజుల కిందట వరకు అలాగే ఉన్న ధరలు తర్వాత మరింత పెరిగాయి. ప్రస్తుతం నాణ్యత ప్రకారం 1870-1900 వరకు పలుకుతోంది. కేంద్రప్రభుత్వం  మద్దతు ధర గ్రేడ్-ఎ రకం ధాన్యం క్వింటాలు రూ1400, కామన్క్రం రూ.1360 ఉంది. గత జూన్‌లో మద్దతు ధరను రూ.55, 50 చొప్పున కేంద్రప్రభుత్వం పెంచింది. మార్కెట్ ధరల ప్రకారం చూస్తే ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాలు రూ.2500 వరకు పలుకుతున్నట్టు. డెల్టాలో ధరల పరిస్థితిలా ఉంటే పల్నాడులో ధాన్యం ధరలో మరో రూ.200 అదనంగా ఉన్నట్టు చెబుతున్నారు.
 
ప్రచారమే పెరుగుదలకు కారణం...
వరి విస్తీర్ణం తగ్గిపోవటంపై జరుగుతున్న విస్తృత ప్రచారమే ధాన్యం ధరల పెరుగుదలకు కారణం. నిజంగా ధాన్యానికి మార్కెట్ వస్తే బియ్యం ధరలూ పెరగాలి కదా?
- పావులూరి రాంబాబు, అధ్యక్షుడు, తెనాలి ఏరియా రైస్‌మిల్లర్ల సంఘం
 
బస్తా రూ.1050కి అమ్ముకున్నా...
ధాన్యం నిల్వ ఉంచితే తరుగు పోతోంది. అప్పులు తెచ్చి వ్యవసాయం చేశాం. తీసుకున్న అప్పులు తీర్చేందుకు కల్లంలోనే ధాన్యం 75 కిలోల బస్తా రూ.1050కి అమ్మా. ఇప్పుడు రేటు పెరగటం చూస్తుంటే బాధనిపిసోంది. వ్యవ సాయం గిట్టుబాటు కావడం లేదు.
-దాచేపల్లి శివరామయ్య, రైతు, కొలకలూరు

మరిన్ని వార్తలు