ప్రాథమిక వైద్యం...ఇంకెంత దూరం!

23 Jun, 2014 00:31 IST|Sakshi
 •      మారుమూల గ్రామాల్లో కానరాని వైద్యసిబ్బంది
 •      ఎపిడమిక్ సీజన్‌లోనూ వీడని నిర్లక్ష్యం
 •      మాతా శిశు వైద్యసేవల్లోనూ ఇబ్బందులే
 • పాడేరు: మండలంలోని మారుమూల కించూరు పంచాయతీకి ప్రభుత్వ ప్రాథమిక వైద్యం అందని ద్రాక్షగానే మారింది. ఎపిడమిక్ సీజన్‌లో కూడా ఇక్కడి గిరిజనులు మెరుగైన వైద్యసేవలకు నోచుకోవడం లేదు. మారుమూల ప్రాంతం కావడంతో ఉన్నతాధికారులు, వైద్యుల పర్యవేక్షణ కూడా కరువైంది. ఈ గ్రామాలకు వైద్యసిబ్బంది ఎప్పుడు వస్తారో..రారో కూడా చెప్పలేమంటూ గిరిజనులు వాపోతున్నారు. స్థానిక ఆశ కార్యకర్తలు అందించే సాధారణ వైద్యం మినహా ప్రత్యేక వైద్య శిబిరాలను మాత్రం కానరావడం లేదు.

  ఆశ కార్యకర్తల వద్ద పూర్తిస్థాయిలో మందుల నిల్వలు కూడా ఉండడం లేదు.  ఉరుగొండ, దోనెల, బల్లుపుట్టు, జి.బొడ్డాపుట్టు, బరిడెపుట్టు, బొంజంగి, కించూరు, వంటివీదుల, గడ్డిబందలు, తోటలుగొంది, గొడ్డళ్ళపాడు, పుట్టమామిడి వంటి మారుమూల గ్రామాలలో ప్రాథమిక వైద్యం కరువైంది. బొంజంగి గ్రామంలో కిల్లో సోమేష్‌కుమార్, కిల్లో మల్లేశ్వరరావు, కిల్లో గోరన్నలు జ్వరాలతో బాధపడుతున్నారు.

  ఆశ కార్యకర్త వద్ద మలేరియా రక్తపరీక్షల ఆర్డీకిట్లు కూడా నిండుకున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నెలవారీ వైద్య తనిఖీల్లో కూడా నిర్లక్ష్యం నెలకొంది. ఈ గ్రామంలో ఆశ కార్యకర్తగా పని చేస్తున్న పూజారి శాంతమ్మ ఆరు నెలలు గర్భిణి అయినప్పటికి ఆమెకు కూడా మాతా శిశు ఆరోగ్య సేవల కార్డును వైద్యసిబ్బంది పంపిణీ చేయకపోవడం గమనార్హం. ఇదే గ్రామంలోని కిల్లో పూలమతి అనే నాలుగు నెలల గర్భిణికి కూడా కార్డు లేదు. గర్భిణులకు నెల నెలా తనిఖీలు చేయాల్సిన వైద్యసిబ్బంది ఈ ఆరు నెలల వ్యవధిలో గత నెలలో మాత్రమే టీకాలు వేశారని బొంజంగి గిరిజనులు పేర్కొంటున్నారు.
   
  అనారోగ్యంతో గిరిజనుడు మృతి
   
  కించూరు పంచాయతీలోని మారుమూల రోడ్డు సౌకర్యం లేని వంటివీధుల గ్రామంలో గిరిజనుడు కిల్లో బుట్టి (50) తీవ్ర అనారోగ్యంతో శనివారం సాయంత్రం మృతి చెందాడు. ఈ గ్రామంలో కూడా వైద్యసిబ్బంది సంచారం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. కిల్లో బుట్టి నెల రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూనే మృతి చెందాడు. ఇలాంటి మరణాలు ఎన్నో సంభవిస్తున్నా మారుమూల ప్రాంతం కావడంతో బాహ్య ప్రపంచానికి తెలియడం లేదు.
   

మరిన్ని వార్తలు