‘ప్రాథమిక ఆరోగ్యం’ విలవిల

29 Sep, 2014 02:58 IST|Sakshi
‘ప్రాథమిక ఆరోగ్యం’ విలవిల

సిబ్బంది లేక.. రోగుల అవస్థలు
భర్తీకాని 325 వైద్య ఖాళీలు
పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రులకు వెళ్లిన 125 మంది వైద్యులు

 
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ), వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందిలేక రోగులు నానా తిప్పలు పడుతున్నారు. వైద్య విద్యా సంచాలకుల పరిధిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఇన్ సర్వీస్ అభ్యర్థులను బోధనాసుపత్రులకు రావాలని నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సుమారు 125 మందికి పైగా స్పెషలిస్ట్ వైద్యులు డీఎంఈ ఆస్పత్రులకు వెళ్లారు. అంతకుముందే 200కు పైగా వైద్యుల(ఎంబీబీఎస్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 325 పోస్టులు ఖాళీలు ఉన్నట్టు ఆరోగ్య సంచాలకుల లెక్కల్లో తేలింది. అసలే 200 మందికి పైగా స్పెషలిస్ట్ వైద్యులు లేక అల్లాడుతున్న ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ఉన్న వైద్యుల్లో 125 మంది బోధనాస్పత్రులకు వెళ్లడం మరింతగా ఇబ్బందిగా మారింది.

120 సీహెచ్‌సీలకు.. 13 సీహెచ్‌సీల్లోనే వైద్యులు

రాష్ట్రంలో డెరైక్టర్ ఆఫ్ హెల్త్(ఆరోగ్య సంచాలకులు) పరిధిలో 120 సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ) ఉన్నాయి. ఇవి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల గర్భిణులకు ప్రసవ కేంద్రాలుగా ఉండాలి. ప్రతి ఆస్పత్రిలోనూ అనస్థీషియా, పీడియాట్రిక్, గైనకాలజీ వైద్యుల బృందం ఉండాలి. కానీ 120 సీహెచ్‌సీలకు పదమూడింటిలోనే ముగ్గురు వైద్యుల బృందం ఉన్నట్టు తేలింది. మిగతా 107 సీహెచ్‌సీల్లో వైద్యుల కొరత ఉంది. సుమారు 20 సీహెచ్‌సీల్లో ముగ్గురు వైద్యులూ లేనివి ఉన్నాయి. ఇక్కడ కేవలం ఎంబీబీఎస్ వైద్యులే ఉంటున్నారు.
 నవంబర్‌లో నోటిఫికేషన్!: అక్టోబర్ 10లోగా సాధారణ బదిలీల ప్రక్రియ ముగుస్తుందని, ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 400కుపైగా వైద్య పోస్టులకు నవంబర్‌లో నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నాయి.
 
 

మరిన్ని వార్తలు