ఇదేం దండనీతి గురువా?!

17 Dec, 2014 03:38 IST|Sakshi

 జరిగిందేమిటో తెలుసుకోలేదు. విద్యార్థి చెబుతున్నా వినిపించుకోలేదు. మితిమీరిన ఆగ్రహంతో ఓ కార్పొరేట్ పాఠశాల ప్రిన్సిపాల్‌గారు నడిరోడ్డుపై విద్యార్థిని చితకబాదారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని నాలుక్కరుచుకున్నారు. అప్పటికైనా నిగ్రహించుకోకుండా తల్లిదండ్రులకు చెబితే స్కూల్ నుంచి రిలీవ్ చేయనని బెదిరించారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ టెన్త్ విద్యార్థి ఇంట్లోని తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చైల్డ్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో వారు పాఠశాలకు వెళ్లి విచారణ జరపడంతో అయ్యగారు దిగొచ్చారు. త ప్పయిందని.. ఇకముందు అలా జరక్కుండా జాగ్రత్త పడతానని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
 
 శ్రీకాకుళం : ఓర్పు, సహనంతో విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్ విచక్షణ కోల్పోయి విద్యార్థిని చితకబాదిన సంఘటన పట్టణంలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో సోమవారం చోటు చేసుకుంది. పాఠశాలలో 10వ తరగతి చదువుతోన్న కె.నిఖిల్‌ను ప్రిన్సిపాల్ రాంప్రసాద్ ఒళ్లంతా కమిలిపోయేలా కొట్టాడు. బాధిత విద్యార్థి తల్లిండ్రుల కథనం ప్రకారం, సాయంత్రం పాఠశాల విడిచిపెట్టిన సమయంలో విద్యార్థులు బయటకు వచ్చి ఆటోల కోసం వేచి ఉన్నారు. అదే సమయంలో నిఖిల్ ముందు వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలు ఓ ఆటో ఎక్కారు.
 
 అదే ఆటో ఎక్కేందుకు నిఖిల్ కూడా వెళ్లాడు. అయితే అంతలోనే ఓ పాము రోడ్డుపైకి దూసుకురావడంతో ఆ అమ్మాయిలు నిఖిల్ రావద్దంటూ కేకలు పెట్టారు. ఈ తతంగాన్ని దూరం నుంచి పరిశీలించిన ప్రిన్సిపాల్ నిఖిల్ అమ్మాయిలను టీజ్ చేస్తున్నాడేమో అనుకుని ఒక్కసారి కోపం తెచ్చుకున్నాడు. అనుకున్నదే తడవుగా అక్కడి చేరుకుని ఇష్టానుసారంగా బాదడంతో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఇంతలో అక్కడివారు, అమ్మాయిలు కలుగ చేసుకొని జరిగిన విషయం తెలిపారు. దీంతో ఖంగుతిన్న ప్రిన్సిపాల్ ‘సరే అయిందేదే అయిపోయింది...ఈ విషయం ఇంట్లో చెప్పావో నువ్వు పదో తరగతి పరీక్షలకు వెళ్లలేవు’ అంటూ బెదిరించి ఇంటికి పంపించేశాడు.
 
 ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిల్ రాత్రంతా తన గది తలుపు తీయకుండా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే 1090 చైల్డ్‌లైన్ నెంబరుకు ఫోన్‌చేసి ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం చైల్డ్‌లైన్ సిబ్బంది, నిఖిల్ కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్‌ను గట్టిగా నిలదీయగా తప్పు ఒప్పుకున్నాడు. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటానని లిఖితపూర్వకంగా తెలియజేయడంతో అంతా శాంతించారు.
 
 ప్రిన్సిపాల్ వివరణ
 ఈ సంఘటన గురించి కళాశాల ప్రిన్సిపాల్‌ను ‘సాక్షి’ ఫోనులో సంప్రదించగా జరిగింది వాస్తవమేనని ధ్రువీకరించారు. అయితే నిఖిల్ అనే విద్యార్థి అల్లరిచిల్లరిగా ఉంటాడని, గతంలోనూ అతనిపై ఫిర్యాదులు ఉన్నాయని అన్నారు. అందుకే ఈ సంఘటనలో అతనిదే తప్పని భావించి మందలించానని వివరించారు. అయితే నిఖిల్ తల్లిదండ్రులు, చైల్డ్‌లైన్ ప్రతినిధుల సమక్షంలో జరిగిన చర్చల్లో రాజీ కుదిరిందన్నారు.
 

మరిన్ని వార్తలు