సబ్ జైలు నుంచి ఖైదీ పరారీ

2 Aug, 2013 02:46 IST|Sakshi

అనకాపల్లి అర్బన్, న్యూస్‌లైన్:  అనకాపల్లి సబ్‌జైలు నుంచి ఖైదీ గురువా రం ఉదయం పరారయ్యాడు. స్థానిక గుండాల వీధికి చెందిన మాదిరెడ్డి రామునాయుడు(25) విశాఖతోపాటు ఇతర జిల్లాల్లో పలు నేరాలకు పాల్పడి రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అనకాపల్లిలో మోటారు సైకిల్ చోరీ కేసుకు సంబంధించి రామానాయుడుపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాజమండ్రి నుంచి అతడ్ని గత నెల 5న స్థానిక సబ్‌కోర్టులో హాజరుపరిచినట్టు పట్టణ సీఐ పి.శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. పంచాయతీ ఎన్నికల వల్ల తిరిగి రాజమండ్రి తరలించకుండా ఇక్కడి సబ్‌జైలులోనే ఉంచారు. గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గదిలో నుంచి బయటికి తీసుకొచ్చిన సమయంలో గోడదూకి పరారయ్యాడు. దీంతో సబ్ జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 సిబ్బంది నిర్లక్ష్యమే కారణం
 పటిష్టమైన సబ్‌జైలు నుంచి ఖైదీ పరారీ వెనుక సిబ్బంది నిర్లక్ష్యం ఉందని జిల్లా ఉప కారాగారాల అధికారి ఆర్.అప్పారావు తెలిపారు. సబ్‌జైలులో ఖైదీ పరారీపై గురువారం జైళ్ల డీఐజీ నర్సింహ, డీఎస్‌ఓ అప్పారావు విచారణ కొనసాగించారు. మధ్యలో డీఐజీ యలమంచిలిలోని సబ్‌జైలును సందర్శించేందుకు వెళ్లగా, డీఎస్‌ఓ అప్పారావు రాత్రి పొద్దుపోయేవరకు విచారణ కొనసాగించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గురువారం ఉదయం 7 గంటల సమయంలో నిందితుడు మాదిరెడ్డి రామునాయుడు (20) జైలు నుంచి పరారైనట్లు తెలియడంతో విచారణకు వచ్చానన్నారు.
 
 బుధవారం రాత్రి డ్యూటీ గేట్ కీపర్‌గా హెడ్‌వార్డర్ వి.నాగేంద్ర, మరో హెడ్ వార్డర్ వి.అప్పలనాయుడు ఉపకారాగారం వద్ద విధులు నిర్వహించారన్నారు. సబ్‌జైలు ప్రహరీ 18 అడుగుల ఎత్తులో ఉందన్నారు. వాటిపై మూడడుగుల ఎత్తులో ఇనుప గ్రిల్స్‌కు విద్యుత్ తీగలు అమర్చామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునేందుకు అవకాశమే లేదని స్పష్టం చేశారు. నిందితుడు జైలు గోడను ఆనుకున్న రెవెన్యూ కార్యాలయం వైపు సన్ సైడ్ నుంచి పరారైనట్లు సిబ్బంది చెబుతున్నా, అలా వెళ్లే అవకాశం కనిపించలేదని పరిశీలనలో తేలిందన్నారు. దీనిపై విచారణ  చేపట్టి  ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు