సెంట్రల్‌ జైలులో మృత్యుఘోష

21 Jul, 2019 13:15 IST|Sakshi
రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు

సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి) : కేంద్ర కారాగారంలో అనారోగ్యంతో ఖైదీలు మృత్యువాతపడుతున్నారు. జైలు పరిమితికి మించి అధికసంఖ్యలో ఖైదీలు ఉండడంతో వారికి సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీలు, రిమాండ్‌ ఖైదీలు కలిపి  మొత్తం 1400 మంది ఉన్నారు. 1200 మందికి çసరిపోయే సెంట్రల్‌ జైలులో అదనంగా 200 మంది  ఉన్నారు.

రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జైలుకు అతి సమీపంలో ప్రభుత్వ జిల్లా అసుపత్రి ఉన్నప్పటికి ఖైదీలను సకాలంలో ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేదు. జైలు నిబంధనల వల్లే ఆసపత్రులకు తరలించడంలో ఆలస్యమై మరణాలు సంభవిస్తున్నాయని పలువురు ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఖైదీని ఆసుపత్రికి తరలించాలంటే  జైలు అధికారులు స్థానిక ఎస్పీకి లెటర్‌ పెట్టాలి. ఆ లెటర్‌ ఆధారంగా ఏఆర్‌ కానిస్టేబుళ్లను కేటాయిస్తారు. ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.

జైలులోని ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నప్పటికీ రాత్రి సమయంలో ఏ ఒక్క డాక్టరూ అందుబాటులో ఉండడం లేదని ఖైదీలు చెబుతున్నారు. షిఫ్టులవారీగా డాక్టర్లు డ్యూటీలు చేస్తున్నట్టు రికార్డులు నిర్వహిస్తున్నప్పటికీ రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో లేక ఖైదీలకు ప్రాణాలమీదకు వస్తోందంటున్నారు. సెంట్రల్‌ జైలులోగల ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు ఫార్మసిస్ట్‌లు, ఎంఎన్‌ఓలు ముగ్గురు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఒకరు ఉన్నారు.  ఏటా ఖైదీల కోసం రూ. 17 లక్షల మెడికల్‌ బడ్జెట్‌ కేటాయిస్తున్నారు. 

నిర్మాణంలో ఉన్న 58 పడకల ఆసుపత్రి 
సెంట్రల్‌ జైలులో 58 పడకల ఆసుపత్రి నిర్మాణంలో ఉంది. దీంతో పాటు జైలు అసుపత్రిలో డాక్టర్లను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. గుండె సంబంధిత (కార్డియాలజిస్ట్‌) డాక్టర్, మానసిక వైద్యుడిని నియమించాల్సి ఉంది. వైద్య సిబ్బందిని కూడా పెంచాల్సి ఉంది. సకాలంలో ఖైదీలను ఆసుపత్రికి తరలించేందుకు నిబంధనలు సడలించాలని పలువురు ఖైదీల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సెంట్రల్‌ జైలు వద్ద నిరంతరం సెక్యూరిటీని ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన ఖైదీలను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి. 

మరిన్ని వార్తలు