రెండింటిపై కన్ను!

11 Feb, 2014 05:21 IST|Sakshi

  విభేదాలకు ఆజ్యం పోస్తున్న పరిటాల శ్రీరామ్ అరంగేట్రం
  రాప్తాడు నుంచి బరిలోకి దించడానికి పరిటాల సునీత వ్యూహం
  పెనుకొండలో బీకే వ్యతిరేక వర్గీయులతో సునీత తరచూ సమావేశం
  తమ కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వాలని బాబుపై సునీత ఒత్తిడి
 కలవరపడుతోన్న బీకే పార్థసారథి.. పయ్యావుల ద్వారా బాబుతో చర్చలు
 
 సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ అరంగేట్రం టీడీపీలో ముసలాన్ని పుట్టించింది. పెనుకొండ నుంచి తనకూ.. రాప్తాడు నుంచి తనయుడికి టికెట్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుపై పరిటాల సునీత తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఇది బీకే పార్థసారథిని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. పయ్యావుల కేశవ్ సహకారంతో పరిటాల సునీత ఎత్తుగడను నీరుగార్చేందుకు బీకే పార్థసారథి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికలు ముం చుకొస్తోన్న వేళ టీడీపీలో టికెట్ల కొట్లాట ప్రారంభమైంది. 2014 ఎన్నికల్లో ఎలాగైనా తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను రాజ కీయ అరంగేట్రం చేయించాలని పరిటాల సునీత పట్టుదలతో ఉ న్నారు. ఇటీవల జరిగిన సహకార, పంచాయతీ ఎన్నికల్లో రా ప్తాడు నియోజకవర్గంలో టీడీపీ వరుస పరాజయాలను చవిచూసింది. ఆ ఫలితాలతో రాప్తాడు నియోజకవర్గంలో తనకు ప్రతి కూల పరిస్థితి ఉందనే భావనకు వచ్చిన పరిటాల సునీత.. పెనుకొండపై కన్నేశారు. రాప్తాడు నుంచి తనయుడు పరిటాల శ్రీరామ్‌ను బరిలోకి దించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
 
  పరిటాల సునీత సూచనల మేరకు పరిటాల శ్రీరామ్ రా జకీయంగా క్రియాశీలకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో పెనుకొండ నియోజకవర్గంపై పరిటాల సునీత ప్రత్యేక దృష్టి సారించారు. 2009 ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొద్ది నెలల్లోనే పరిటాల రవి వర్గీయులతో ఎమ్మెల్యే బీకే పార్థసారథి విభేదించారు. బీకే పార్థసారథి తమ మాటను ఖాతరు చేయడం లేదనే నెపంతో పరిటాల రవి వర్గీయులు ఆయనకు వ్యతిరేకంగా జట్టుకట్టారు. ఇటీవల ఆ వర్గంతో పరిటాల సునీత తరచూ సమావేశమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున తానే పోటీ చేస్తానని అనుచరులతో ఆమె స్పష్టీకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశంపై ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో పరిటాల సునీత భేటీ అయ్యారు. తనకు పెనుకొండ నుంచి.. తనయుడికి రాప్తాడు నుంచి అవకాశం కల్పించాలని డిమాండ్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాప్తాడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోవాలంటూ పరిటాల సునీత డిమాండ్‌ను చంద్రబాబు సున్నితంగా తోసిపుచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కానీ.. పరిటాల సునీత తన డిమాండ్‌పై వెనక్కు తగ్గలేదు. తమ వ్యతిరేకులకు పార్టీలో స్థానం కల్పిస్తోన్న నేపథ్యంలో.. రాప్తాడుతోపాటూ పెనుకొండ స్థానాన్ని కూడా తమకే కేటాయించాలని చంద్రబాబును కో రినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
 
  ఒకవేళ ఆ ప్రతిపాదనకు అంగీకరించని పక్షంలో.. తమ వ్యతిరేక వర్గాలకు పార్టీ తీర్థం ఇ చ్చే ప్రతిపాదనను వ్యతిరేకిస్తామని చంద్రబాబు కోటరీ అయిన సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావులతో ప రిటాల సునీత తెగేసి చెప్పినట్లు సమాచారం. బీకే పార్థసారథిని హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించాలని సు నీత సూచించారు. పెనుకొండపై కన్నేయడంతో బీకే పార్థసారథి తేరుకున్నారు. హిందూపురం లోక్‌సభ స్థానంలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోండటం.. సిటింగ్ ఎంపీగా నిమ్మల కిష్టప్ప ఉండటంతో తనకు టికెట్ వచ్చే అవకాశాలు ఉండవని బీకే అంచనా వేస్తున్నారు. ఇటీవల చంద్రబాబుతో సమావేశమై పెనుకొండ టికెట్‌ను తనకే కేటాయించాలని కోరగా,బాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం బీకేను కలవర పరిచింది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ద్వారా పెనుకొండ టికెట్‌ను తనకే కేటాయించేలా చంద్రబాబుపై బీకే పార్థసారథి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

>
మరిన్ని వార్తలు