ఆర్టీసీ కార్మికుల సమ్మెతో దోపిడీకి తెరతీసిన ప్రైవేటు ఆపరేటర్లు

20 Sep, 2013 02:51 IST|Sakshi


 చీరాల, న్యూస్‌లైన్ :
 ప్రైవేటు ట్రావెల్స్ జనాన్ని జలగల్లా పీడిస్తున్నాయి. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన తయారైంది వాటి తీరు. ఆర్టీసీ బస్సులు లేకపోవడం.. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల తాకిడి ఎక్కవ కావడంతో రోజూ వసూలు చేసే చార్జీల కంటే అధికంగా పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటనను నిరసిస్తూ ఆర్టీసీ యూనియన్లు ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లాయి. రోజుకు వందల మైళ్లు తిరిగే బస్సులు సమైక్యాంధ్ర సమ్మెతో డిపోలకే పరిమితమయ్యాయి. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల అవసరాలను ఆసరా చేసుకుని చార్జీలను అమాంతం పెంచేశారు. చీరాల నుంచి రోజూ పది ప్రైవేటు ట్రావెల్స్‌కు చెంది న బస్సులు హైదరాబాద్, బెంగళూరు వెళుతుంటాయి. శని, ఆదివారాల్లో ఒక రేటు, మిగి లిన రోజుల్లో మరో రేటు నిర్ణయించి వసూలు చేస్తుంటారు. ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటంతో రాత్రి వేళ వెళ్లే బస్సుల చార్జీలను రెట్టింపు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లాలంటే రైలు టికెట్లు దొరక్కపోవడంతో కష్టమో నష్టమో భరించి అధిక మొత్తంలో చెల్లిస్తున్నారు. గతంలో ఇంటర్నెట్‌లో టికెట్లు బుక్ చేసుకునేవారు.
 
  నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ధోరణిలో ప్రైవేటు ట్రావెల్స్ రోజుకొక రేటు ఇంటర్నెట్‌లో ఉంచడంతో ప్రయాణికులు గందరగోళంలో పడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం తదిత ర దూర ప్రాంతాలకు రైళ్లలో టికెట్లు లభించకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టానుసారం గా ధరలు నిర్ణయిస్తున్నాయి.వినాయకచవితికి దూర ప్రాంతాల నుంచి వచ్చి తిరిగి వెళ్లేందుకు బస్ చార్జీలను ట్రావెల్స్ నిర్వాహకులు భారీ ఎత్తున పెంచేశారు. ట్రావెలర్స్ పెంచిన ధరల చూస్తే ప్రయాణికుల కళ్లు గిర్రున తిరుగుతాయి. ఒక్కో టికెట్ వెయ్యి రూపాయల వరకు పలకడంతో కొంతమంది ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. మరో నెలలో రానున్న దసరా, దీపావళి పండుగలకు ఎంత మొత్తంలో చార్జీలు ఉంటాయోనని ప్రయాణికులు ఇప్పటి నుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య జిల్లా అంతటా ఉంది.  
 

>
మరిన్ని వార్తలు