ఫీజు కట్టు హల్ టికెట్ పట్టు!

26 Feb, 2018 12:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఈ నెల 28 నుంచి ఇంటర్‌ పరీక్షలు

పరీక్షల వేళ...ఫీజుల పేరుతో ఒత్తిడి!

అదనంగా రూ.5 వేల నుంచి 10 వేలదాకా వసూళ్లు  

కమిషనర్‌ ఆదేశాలు బేఖాతర్‌

కర్నూలులోని గణేశ్‌నగర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కుమార్తెకు టెన్త్‌  చదువుతున్న సమయంలోనే ఓ ప్రముఖ కార్పొరేట్‌ కళాశాల వారు ఫస్టియర్‌ ఎంపీసీలో అడ్మిషన్‌ ఇచ్చారు. అప్పట్లో రూ.30 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే పుస్తకాలు, పరీక్షల పేరుతో అదనంగా రూ.5 వేలు వసూలు చేశారు. ప్రస్తుతం హాల్‌టికెట్‌ కావాలంటే  మరో రూ.5 వేలు చెల్లించాలని కళాశాల సిబ్బంది తెగేసి చెప్పారు. అడిగినంత డబ్బు ఇచ్చుకోలేక వారు హాల్‌టికెట్‌ కోసం కళాశాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

‘ఇంటర్‌ విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇవ్వకుండా ఫీజులు, హాజరు శాతం పేరుతో వేధింపులకు గురి చేస్తే కళాశాలల  యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం’ ఇదీ శుక్రవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ ఉదయలక్ష్మీ ఆదేశాలు. అయితే ఈ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు.

కర్నూలు సిటీ: ఫీజుల విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాలను జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. ప్రధానంగా ఫీజులు కడితేనే హాల్‌ టికెట్‌ ఇస్తామని చెబుతుండడంతో విద్యార్థులతోపాటు తల్లిందండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 28 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 76,078 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 115 కేంద్రాలను ఏర్పాటు చేశారు.  

కళాశాలల చుట్టూ  ప్రదక్షణలు  
ఫీజులు చెల్లించలేదని ఒక కళాశాల, హాజరుశాతం తక్కువగా ఉందని మరో కళాశాల, పోటీ పరీక్షల కోసం కోచింగ్‌ పేరుతో ఇంకొన్ని కళాశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్‌ సమయంలో ఫీజులో రాయితీ ఇస్తామని చెప్పి తీరా పరీక్షల సమయం వచ్చే సరికి ఫీజు మొత్తం చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు.సెకండియర్‌ విద్యార్థులకు గతేడాది కంటే అదనంగా రూ.10 వేలు, నీట్, ఎంసెట్‌ కోచింగ్‌ పేరుతో రూ.10 నుంచి రూ.20 వేల వరకు బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై కొంత విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా ఇంటర్‌ బోర్డు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఒక వైపు హాల్‌టికెట్లు అందకపోవడం, మరో వైపు పరీక్షల గడువు సమీపించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

హాజరుశాతం పేరుతో అడ్డగోలుగా వసూళ్లు!
జిల్లావ్యాప్తంగా మొత్తం 226 జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కళాశాలలు 42, ఆదర్శ  32, ప్రైవేటు 87, కార్పొరేట్‌ 18, ఇతర యాజమాన్యాల పరిధి 47 కళాశాలలున్నాయి. ప్రధానంగా ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో హాజరు శాతాన్ని బట్టి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. 60 శాతం ఉంటే  రూ.5 వేలు, 75 శాతం కంటే తక్కువగా ఉంటే రూ.2 వేల నుంచి రూ.3 వేల దాకా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

మా దృష్టికి రాలేదు.
జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి  రాలేదు.  ప్రభుత్వ కళాశాలల్లో బోర్డు నిబంధనల ప్రకారం 75 శాతం హాజరు ఉంటేనే హాల్‌ టికెట్లు ఇస్తారు. ఆర్ట్స్‌ విద్యార్థులకు మాత్రం తక్కువగా ఉన్నా రూ.వెయ్యి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.     – వై.పరమేశ్వరరెడ్డి, ఆర్‌ఐఓ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా