స్టూడెంట్లకు వల..!

8 Mar, 2019 08:10 IST|Sakshi
బీఆర్‌ఏయూలో ఎంకాం విద్యార్థులు

వర్సిటీ విద్యార్థులకు గాలం వేస్తున్న ప్రైవేట్‌ కన్సల్టెన్సీలు

కన్సల్టెన్సీలపై అనుమానాలెన్నో..

విద్యార్థులు అప్రమతంగా ఉండాలంటున్న నిపుణులు

 శ్రీకాకుళం , ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాయంలో పీజీ విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఏప్రిల్‌లో రెండు, నాలుగు సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌కు సెమిస్టర్‌ పరీక్షలు కీలకం. 2019 సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రైవేట్‌ కన్సల్టెన్సీలు విద్యార్థులను సర్వేల కోసం వినియోగించుకుంటున్నారు. ఈ సమయంలో తాయిళాలకు ఆశ పడితే విద్యార్థుల భవిష్యత్‌ దారుణంగా దెబ్బ తింటుంది. రోజుకు రూ.700 సైతం ఇచ్చేందుకు కన్సల్టెన్సీలు సిద్ధమవుతుండడంపై చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి తోడు ఇదివరకు ఎప్పుడూ ఇంత ఉద్ధృతంగా విద్యార్థులతో సర్వేలు ఎవరూ జరిపించలేదు. దీంతో ఈ కన్సల్టెన్సీల వెనుక అధికార పార్టీ హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల నివేదిక ఆధారంగా ఎన్నికలకు సిద్ధం కావచ్చన్నది రాజకీయ పార్టీల ప్రధాన వ్యూహం.

వర్సిటీలో సర్వే సామర్థ్యం, విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉన్న ఎంబీఏ, ఎంకాం, ఎకనామిక్స్, సోషల్‌ వర్క్‌ వంటి విభాగాల విద్యార్థులపై ఎక్కువగా సర్వే కన్సల్టెన్సీలు దృష్టి పెడుతున్నాయి. అధ్యాపకులు కూడా ఈ సర్వేలకు వ్యతిరేకంగానే ఉన్నారు. వర్సిటీ ఆధ్వర్యంలో సామాజిక అనుసంధాన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి శనివారం సర్వేలు నిర్వహిస్తుంటారు. వర్సిటీ బోధన సిబ్బంది సమక్షంలో ఈ సర్వేలు జరగుతున్నాయి. ప్రస్తుతం వర్సిటీ అధికారులు మాత్రం ప్రైవేటు సర్వేలకు విద్యార్థులకు ఎలాంటి అనుమతులు ఇవ్వటం లేదు. అధికారులకు సంబంధం లేకుండా సర్వేలకు వెళితే మాత్రం నియంత్రించటం కష్టం. ప్రస్తుతం గ్రామాల్లో సర్వే బృందాలకు, అధికార పార్టీ అనుకుల సర్వేలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.  

అనవసర కేసుల్లో ఇరుక్కుంటారు
సర్వేలకు వెళ్లటం వల్ల విద్యార్థులు అనవసర కేసుల్లో ఇరుక్కుం టారు. అధికార పార్టీ యువతను ఎక్కువగా సర్వేలు పేరుతో వాడుకుంటుంది. ప్రైవేట్‌ సంస్థలకు సర్వేలు అప్పగిస్తుంది. విద్యార్థులు అప్రమతంగా ఉండాలి. గ్రామాల్లో సమస్యలు ఎదురు కావచ్చు. పోలీస్‌ కేసులు నమోదు కావచ్చు. భవిష్యత్‌ దృష్టిలో ఉంచుకుని సర్వేలకు విద్యార్థులు దూరంగా ఉండాలి.– మొదలవలస చిరంజీవి, హైకోర్టు న్యాయ వాధి, రాష్ట్ర వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి

విద్యార్థులను పిలుస్తున్నారు
విద్యార్థులను ప్రెవేట్‌ కన్సల్టెన్సీ లు సర్వేల కోసం పిలుస్తున్నాయి. అయితే విద్యార్థులు మాత్రం ఆసక్తి చూపించటం లేదు. విద్యార్థి యూనియన్‌గా విద్యార్థులకు సర్వేలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నాం. విద్యాసంస్థల్లో విద్యార్థులను సర్వేలకు ఆహ్వానించటం మంచి పద్ధతి కాదు.– బి.నరేంద్ర చక్రవర్తి, ఏబీవీపీ యూనియన్‌ నాయకులు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం.

చదువు పై దృష్టిపెట్టాలి
విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ప్రైవేట్‌ కన్సల్టెన్సీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. విద్యార్థులు వారి వద్దకు వెళ్లవద్దు. తరగతులకు హాజరై చదువు ప్రాధాన్యమివ్వాలి. విలువైన సమయం దుర్వినియోగం అవుతుంది. సర్వేల కోసం ప్రైవేట్‌ సంస్థలు విద్యార్థులను నేరుగా కలిస్తే సమస్య మా దృష్టికి తీసుకురావాలి.– ప్రొఫెసర్‌ కె.రఘుబాబు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం

మరిన్ని వార్తలు