నేడు వైద్యం బంద్‌

31 Jul, 2019 09:50 IST|Sakshi

సాక్షి, లబ్బీపేట(విజయవాడ) : వైద్యుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్లమెంటులో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లును ఆమోదించడానికి నిరసనగా నేడు వైద్యం బంద్‌ చేయనున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకూ ఓపీ సేవలతో పాటు, ఎమర్జెన్సీ కూడా బంద్‌ పాటించాలని ఐఎంఏ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఏపీ చాప్టర్‌ నిర్ణయించినట్లు విజయవాడ శాఖ కార్యదర్శి డాక్టర్‌ సీహెచ్‌ మనోజ్‌కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. అయితే మానవతా దృక్ఫథంలో ప్రాణాపాయంతో ఆస్పత్రికి వచ్చిన వారికి వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

దేశంలో దశాబ్దాలుగా ఉన్న మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ)ను రద్దు చేసి, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఏర్పాటును ఐఎంఏ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. వైద్యులు ఆందోళన చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిరంకుశత్వంగా బిల్లును పార్లమెంటులో ఆమోదించడంపై వైద్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా బంద్‌ పాటించాలని నిర్ణయించారు. నగరంలోని అన్ని కారొపరేట్‌ ఆస్పత్రిలు, నర్సింగ్‌ హోమ్స్, క్లినిక్‌లలో అవుట్‌ పేషేంట్‌ సేవలతో పాటు, అన్ని రకాల సేవలు నిలిపివేయనున్నట్లు డాక్టర్‌ మనోజ్‌కుమార్‌ తెలిపారు. అయితే రోడ్డుప్రమాదాలు, గుండె పోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటి వాటితో ప్రాణాపాయంతో వచ్చిన వారికి మాత్రం సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు. 

ప్రభుత్వాస్పత్రిలో కొనసాగనున్న సేవలు 
ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వాస్పత్రిలో సేవలు యథాతదంగా అందించనున్నారు. అవుట్‌పేషెంట్‌ సేవలతో పాటు అన్ని రకాల సేవలు అందిస్తారు. కాగా జూనియర్‌ వైద్యులు మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.  

మరిన్ని వార్తలు