విద్యపై జీఎస్టీ భారం.. 

21 Jun, 2019 13:03 IST|Sakshi
బుక్‌స్టాల్స్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న పాఠ్యపుస్తకాలు  

గత ఏడాది కన్నా భారీగా పెరిగిన ఖర్చులు 

పెన్ను, పేపర్, పుస్తకాలపై పన్ను వడ్డింపు 

అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం 

సాక్షి, ఇల్లెందుఅర్బన్‌ : ప్రైవేట్‌ విద్య రాను రాను మరింత ఖరీదవుతోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు విద్యాభారం మోయలేకపోతున్నాయి. తాము కష్టపడి సంపాదించిదంతా పిల్ల చదువులకే ఖర్చవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 2018–19 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు కావాల్సిన నోట్‌ పుస్తకాలు ,యూనిఫాంలపై జీఎస్టీ భారం పడింది. దీంతో గతేడాది కన్నా ఈ ఏడాది నోట్‌ పుస్తకాలు, దుస్తుల ధరలు భారీగా పెరిగాయి. ఇదే అదునుగా యాజమాన్యాలు జీఎస్టీ పేరుతో సరికొత్త విద్యా వ్యాపారానికి తెరలేపాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పెన్సిల్‌ మొదలుకొని యూనిఫాం,దుస్తుల వరకు ప్రయివేట్‌ పాఠశాలలు చెప్పిన చోటనే కొనుగోలు చేయాలనే నిబంధనలు విధిస్తుండడంతో తల్లిదండ్రులపై పెద్ద ఎత్తున భారం పడుతుంది. నోట్‌ పుస్తకాలపై 12శాతం జీఎస్టీ విధించడంతో ఈసారి ఒక్కో నోటు పుస్తకంపై రూ.10 నుంచి రూ.15 వరకు ధరలను పెంచి విక్రయిస్తున్నారు. గతేడాది ఒకటో తరగతి విద్యార్థికి నోటు పుస్తకాలు ,పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేస్తే రూ.1200 వరకు ఖర్చయ్యేది.

ప్రస్తుతం ఒక్కసారిగా రూ 1500 నుంచి 2వేల లోపు ఖర్చవుతోంది. యూనిఫాం పై ప్రభుత్వం ఐదు శాతం జీఎస్టీ విధించడంతో దుకాణదారులు ఏకంగా దాన్ని 8 నుంచి 10శాతంకు పైగా పెంచి విక్రయిస్తున్నారు. కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు చెప్పిన చోటనే పాఠ్య, నోట్‌ పుస్తకాలు కొనుగోలు చేయాలి. ఇలా యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు పాఠశాలల యాజమాన్యాలు చెప్పిన బుక్‌స్టాల్స్‌లోనే  విక్రయించడంతో వచ్చిన కమిషన్‌లను పాఠశాల యాజమాన్యాలు పంచుకుంటున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 

విద్యార్థుల తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, టిఫిన్‌ బాక్సులు ,స్కూలు బ్యాగ్‌లు, వాటర్‌ బాటీల్స్‌ తదితర పిల్లలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అయితే గతేడాది కంటే ఈ ఏడాది ప్రతి వస్తువుపై ధర రెండింతలు పెరిగింది. ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు పాఠశాల ఫీజులతో కలిపి సుమారు రూ 70వేలకు పైగా ఖర్చు వచ్చే పరిస్థితి నెలకొంది. జీఎస్టీ కారణంతో కొందరు బుక్‌స్టాల్స్‌యాజమాన్యాలు అధిక ధరలు వేసి బిల్లు లేకుండానే విక్రయించడంతో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలకు దిగుతున్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి జీఎస్టీ కంటే అదనంగా పుస్తకాలను విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు