వృత్తి ధర్మం మరచిన ప్రైవేటు

7 Apr, 2020 07:11 IST|Sakshi

కరోనా ఎఫెక్ట్‌తో ప్రైవేటు ఆస్పత్రుల మూత 

కలెక్టర్‌ ఆదేశించినా తలుపులు తెరచుకోని వైనం 

లైసెన్సులు రద్దు చేస్తామన్నా పట్టించుకోని వైద్యులు 

సకాలంలో వైద్యం అందక జనం గగ్గోలు 

సాక్షి, అనంతపురం: కరోనా కల్లోలంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులకు క్షణం తీరిక లేకుండా పోయింది. ఈ కష్టకాలంలో సాయంగా నిలవాల్సిన ప్రైవేటు ఆస్పత్రులు బాధ్యత మరిచాయి. ఎమర్జెన్సీ సేవలతో పాటు ఓపీ తప్పనిసరిగా చూడాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు, జిల్లా వైద్యాధికారి అనిల్‌కుమార్‌ ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులను ఆదేశించినా.. కొందరు వైద్యుల్లో మార్పు రాలేదు.   డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కింద ఆస్పత్రులను స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్‌ నిక్కచ్చిగా చెప్పడంతో కొందరు వెనక్కి తగ్గినా.. మరికొందరు మాత్రం తీరు మార్చుకోలేదు. కరోనా కట్టడికి ప్రభుత్వం  విస్తృతమైన సేవలందిస్తున్న ఈ తరుణంలో ప్రైవేటు వైద్యులు అండగా నిలవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

90 శాతం ఆస్పత్రులు మూత.. 
జిల్లాలో మొత్తం 258 ప్రైవేట్‌ ఆస్పత్రులుండగా.. వీటిలో ప్రముఖ ఆస్పత్రులు మాత్రమే తెరిచారు. మిగతా 90 శాతం ఆస్పత్రులను మూసేశారు. వాస్తవంగా రోజూ వేల సంఖ్యలో రోగులు వివిధ ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి. ఆస్పత్రులు మూతపడడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

భయం.. భయం 
కరోనా నేపథ్యంలో ఆస్పత్రులను స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో మూడు ఆస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా ప్రకటించారు. ఈ క్రమంలో కొందరు వైద్యులు తమ ఆస్పత్రులను ఎక్కడ స్వాధీనం చేసుకుంటారోనని ముందస్తుగా వైద్య సేవలు బంద్‌ చేశారు. జిల్లాలోని  చాలా ఆస్పత్రులు మూతపడగా.. ఇబ్బంది పడుతున్న రోగులు ఆరోగ్యశాఖాధికారులకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇప్పటికే కలెక్టర్‌ గంధం చంద్రుడు దృష్టికి సైతం వెళ్లగా ఆయన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

రోగులకు ప్రత్యక్ష నరకం..  
డయాబెటిక్‌తో బాధపడుతున్న శ్రీనివాస్‌ నగరంలోని సాయినగర్‌లోని ఓ ఆస్పత్రిలో తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాడు. ఇదివరకే హార్ట్‌ స్ట్రోక్‌ రాగా...వెంటనే ఆస్పత్రిలో చేరగా గండం గడిచింది. ప్రస్తుతం అతను క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. కానీ అతను వెళ్లే ఆస్పత్రి వారం రోజులు క్రితం మూసివేయగా తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు.

ఈయన రెవెన్యూ కాలనీకి చెందిన రాము. తన కూతురు జేష్వితకు సోమవారం విరేచనాలు, జ్వరం రావడంతో ఆస్పత్రులవైపు పరుగుతీశాడు. కానీ నగరంలో చాలా ఆస్పత్రులు మూసివేశారు. బిడ్డ పరిస్థితి చూసి రాము కన్నీళ్లు పెట్టుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్‌ ద్వారా ఓ వైద్యున్ని సంప్రదించి మందులు తీసుకుని వెళ్లిపోయాడు.  
..జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులన్నీ మూసివేయగా.. రాము లాంటి వారు ఎందరో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జిల్లాలోని 258 ప్రైవేట్‌ ఆస్పత్రులన్నీ ఎమర్జెన్సీ సేవలు అందించాలని, ఎవరైనా తాళం వేస్తే ఎస్మా చట్టం కింద లైసెన్స్‌లను రద్దు చేస్తామని కలెక్టర్‌ హెచ్చరించినా ప్రైవేటు వైద్యులు తీరు మారలేదు. 

హౌసింగ్‌బోర్డుకు చెందిన ఆంజనేయులు గుండె సంబంధ వ్యాధితో పాటు డయాబెటిక్, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నాడు. నగరంలోని బస్టాండ్‌ సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందేవాడు. ఆ ఆస్పత్రి మూసివేయడంతో ఆయన సర్వజనాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ కరోనా కేసుల నేపథ్యంలో వైద్యులు బిజీగా ఉన్నారు. అదే ప్రైవేట్‌ ఆస్పత్రి తెరిచి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

నగరానికి చెందిన దంపతులకు మూడ్రోజుల క్రితం ఓ పాప జన్మించింది.  జాండిస్‌ లక్షణాలు కనిపించడంతో చిన్నారిని ఫోటోథెరపీలో ఉంచాలని వైద్యులు సూచించారు.    దీంతో వారు నగరంలోని పలు ఆస్పత్రులకు వెళ్లగా ఎక్కడా చేర్చుకోలేదు. మూడ్రోజుల బిడ్డను తీసుకుని వారు పరుగులు పెట్టారు. చివరకు బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఓ ఆస్పత్రిలో చిన్నారిని అడ్మిషన్‌ చేసుకోగా తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు మూసివేయగా.. కిడ్నీ, మధుమేహం, హైపర్‌టెన్షన్, మానసిక ఒత్తిడి, గుండె తదితర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు అవస్థలు పడుతున్నారు. వీరికి రెగ్యులర్‌గా డాక్టర్‌ చెకప్‌ తప్పనిసరి. రెగ్యులర్‌గా వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని మందులు క్రమం తప్పకుండా వాడకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం. 
 

మరిన్ని వార్తలు