సాధారణ జ్వరానికీ డెంగీ పరీక్షలు

14 Oct, 2019 12:07 IST|Sakshi

రూ.వేలు గుంజుతున్న వైనం

ప్రైవేట్‌ ల్యాబ్‌ల నిర్వాకం

బెంబేలెత్తుతున్న ప్రజలు

జ్వరం వస్తే మందు బిళ్ల వేసుకునేవాళ్లం.. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంజక్షన్‌ వేసుకుంటే రెండు, మూడు రోజుల్లో నయం అయ్యేది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం కూడా ఖరీదైన వ్యాధిగా మారింది. కొందరు ప్రైవేట్‌ వైద్యులు, ల్యాబ్‌ల నిర్వాహకుల పుణ్యమా అని జ్వరం పేరు చెబితే భయపడే రోజులు వచ్చాయి. కొన్ని రోజుల నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ కారణంగా గ్రామాలు, పట్టణాల్లో పిల్లలు మొదలు కొని వృద్ధుల వరకు జ్వరాలతో బాధ పడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇదే అదునుగా భావించి కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు దోచుకునే పనిలో పడ్డాయి.  

ప్రొద్దుటూరు క్రైం : టైఫాయిడ్, మలేరియా, సాధారణ జ్వరం వచ్చినప్పుడు ఎవరికైనా నీరసంగా ఉంటుంది. ఈ కారణంగా ప్లేట్‌లెట్‌ కౌంట్స్‌ తగ్గుతాయి. అయితే జ్వరంతో ఆస్పత్రికి వెళ్లిన ప్రతి కేసుకు ప్రైవేట్‌ ఆస్పత్రులు, అనుబంధ ల్యాబ్‌ నిర్వాహకులు డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తకణాలు తగ్గాయని వారిని భయపెడుతూ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకుంటున్నారు. రోజుకు రెండు సార్లు రక్తపరీక్షలు చేస్తూ రోగిని పిప్పి చేస్తున్నారు. ల్యాబ్‌ పరీక్షలు నిర్వహించే క్రమంలో రోగులకు డెంగీ పాజిటివ్‌ వచ్చినట్లు చూపుతుండటంతో రోగి, కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా నాలుగైదు రోజులకే సుమారు రూ. 40–50 వేలు దాకా ఆస్పత్రి బిల్లు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

పుట్టగొడుగుల్లా ల్యాబ్‌లు
జిల్లా వ్యాప్తంగా అనుమతి లేని ల్యాబ్‌లు వందల్లో ఉన్నాయి. జిల్లాలో సుమారు 550కి పైగా క్లినికల్‌ ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి మాత్రమే వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయం బహిరంగ రహస్యమే అయినా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో జంకుతున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా కోర్సు పూర్తి చేసి ల్యాబ్‌టెక్నీషియన్‌లచే క్లినికల్‌ ల్యాబ్‌లను నిర్వహించాలి. అయితే చాలా చోట్ల అర్హత, అనుభవం లేని వారితో పరీక్షలు చేయిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని భయాందోళనలు చెందుతున్నారు. లేబొరేటరీలను తనిఖీ చేసే అధికారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులకుంది. ప్రతి ల్యాబ్‌ను అధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. నిబంధనల మేరకు ల్యాబ్‌లను ఏర్పాటు చేశారా, రిజిష్టర్‌ చేయించారా, అర్హులైన టెక్నీషియన్‌లు ఉన్నారా అనే వివరాలను పరిశీలించాలి. 

ప్రైవేట్‌ వైద్యులకు భారీగా కమీషన్లు
జిల్లాలోని అనేక ఆస్పత్రులకు ల్యాబ్‌ సౌకర్యం లేదు. దీంతో వారు బయటికి రాసి పంపుతుంటారు. రెఫర్‌ చేసినందుకు ప్రైవేట్‌ ల్యాబ్‌లు వైద్యులకు భారీగా కమీషన్లు ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్‌ డబ్బులే కొందరు డాక్టర్లకు నెలకు రూ. లక్షలు వస్తున్నాయి. వైద్యులు రాసే పరీక్షల్లో వైద్యుడిని బట్టి రక్తపరీక్షలు, స్కానింగ్‌లకు 30 నుంచి 50 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది వైద్యులు ఆస్పత్రిలోనే ల్యాబ్‌లను సొంతంగా నిర్వహించుకుంటున్నారు. ఫీజులు తగ్గిస్తున్నారా అంటే బయట ల్యాబ్‌ల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా అనుమతి లేని ల్యాబ్‌లు
ప్రొద్దుటూరులో అనుమతి లేకుండా విచ్చలవిడిగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 50కి పైగా క్లినికల్‌ ల్యాబ్‌లు ఉండగా వాటిలో కేవలం 14 వాటికే వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్‌ ఆస్పత్రులకు అనుబంధంగా ఎక్కువగా ల్యాబ్‌లు వెలిశాయి. వీటిల్లో ఇచ్చే రిపోర్టుల్లో కూడా తేడాలున్నట్లు తెలుస్తోంది. ఒక ల్యాబ్‌లో ఒక వ్యక్తి రక్తపరీక్ష చేయించుకొని, అతను మరో ల్యాబ్‌కు వెళ్తే వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఏ పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారనే వివరాలు ల్యాబ్‌ల్లో కనిపించవు. నిబంధనల ప్రకారం అన్ని ల్యాబ్‌లు, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పేషెంట్లకు కనిపించేలా ధరల పట్టిక పెట్టాలి. ధరల పట్టిక లేకపోవడంతో ఆస్పత్రి డిమాండ్‌ను బట్టి ల్యాబ్‌ టెస్ట్‌లకు డబ్బు వసూలు చేస్తున్నారు.  

చర్యలు తీసుకుంటాం..
అనుమతి లేకుండా ల్యాబ్‌లను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. అలాగే ల్యాబ్‌ల్లో నిబంధనల మేరకు టెక్నీషియన్‌లతోనే పని చేయించాలి. ఏఎన్‌ఎంల రిక్రూట్‌మెంట్‌ పనిలో ఉన్నాం. రిక్రూట్‌మెంట్‌ పూర్తవ్వగానే క్లినికల్‌ ల్యాబ్‌లను పరిశీలిస్తాం.  – ఉమాసుందరి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, కడప. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా