కరోనా వేళ.. కాసులవేట

9 Jul, 2020 13:14 IST|Sakshi

అత్యవసర వైద్యసేవల పేరుతో దోపిడీ

కొన్ని కార్పొరేట్, ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాకం

రూ.లక్షల్లో ఫీజుల వసూలు

కోవిడ్‌– 19 నిబంధనలు పాటించని వైనం

పలువురు డాక్టర్లు, సిబ్బందికి పాజిటివ్‌

హైబీపీ వచ్చి మెదడులో బ్లడ్‌ క్లాట్‌ అయిన వ్యక్తి నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాడు. అతడికి ట్రీట్‌మెంట్‌ పేరుతో రూ.లక్షల్లో ఫీజు వసూలు చేశారు. అయితే రోగి కోలుకోలేక చనిపోయాడు. ఆ మృతదేహాన్ని అప్పగించాలంటే మొత్తం ఫీజు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్‌ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి.

కరోనా విపత్తులోనూ కార్పొరేట్‌ ఆస్పత్రులు ధనదాహంతో రెచ్చిపోతున్నాయి. బిల్లులు చూస్తే గుండె గుబేలుమంటోంది. ఏ చికిత్స కోసం వెళ్లినా కోవిడ్‌ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అత్యవసర సేవల పేరుతో భారీ మొత్తంలో ఫీజులు గుంజుతున్నాయి. కాసుల కక్కుర్తితో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో అయితే మచ్చుకైనా కోవిడ్‌ నిబంధనలు అమలు కావడంలేదు. యాజమాన్యాలనిర్లక్ష్యం ఫలితంగా వైద్యులు, సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు. నగరంలోని కొన్ని ఆస్పత్రుల వైద్యులు, సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది.(ఆక్సిజన్‌ పెట్టకుండానే బిల్లు!)

సాక్షి, నెల్లూరు: కరోనా మహమ్మరి విజృంభన.. మొదటి విడత లాక్‌డౌన్‌లో ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రులు పూర్తిస్థాయిలో ఓపీలు నిలిపివేశాయి. త్యవసర చికిత్సకు మాత్రమే అనుమతి ఇచ్చారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత పలు కార్పొరేట్‌ ఆస్పత్రులతోపాటు పలు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో వైద్యసేవలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పెద్దాస్పత్రిని కోవిడ్‌ కేంద్రంగా మార్పు చేశారు. అలాగే  పలువురు కీలక వైద్యులను కరోనా డ్యూటీలు చేస్తుండడంతో పేదలు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రుల గడప తొక్కాల్సి వస్తోంది.ఇదే అదనుగా భావించిన యాజమన్యాలు కాసుల వేట ప్రారంభించాయి.
అత్యవసర చికిత్స పేరుతో ఐసీయూ విభాగంలో ఉంచి రోజుకు రూ.లక్షల్లో బిల్లులు వేస్తూ దోచేస్తున్నాయి.
నగరంలోని పలు ఆస్పత్రుల్లో సుమారు 400 మంది ఐసీయూల్లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

జిల్లాలో సమాచారం
జిల్లాలో క్లినిక్‌లు 112, పడకల ఆస్పత్రులు 124, మేజర్‌ ఆస్పత్రులు 51, ల్యాబ్‌లు 48, స్కానింగ్‌ సెంటర్లు 176 వరకు అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అనుమతుల్లేకుండా సుమారు 150 వరకు క్లినిక్‌లు, ఆస్పత్రులున్నాయి.

నిబంధనల జాడలేదు
జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.
ఈక్రమంలో కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కోవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటించాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని తమకేం పట్టనట్లుగా ఉన్నాయి.
హాస్పిటల్స్‌కు వచ్చే ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించాలి, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేయాలి. ప్రతిఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి. కొన్నింట్లో ఇవేమీ అమలు కావడంలేదు.
కొందరికి కరోనా లక్షణాలున్నా టెస్ట్‌ చేయడంలేదు. కాగా కోవిడ్‌ బాధితులకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం లేదు.
రోగితోపాటు ఎక్కువ మందిని ఆస్పత్రుల్లోకి పంపుతున్నారు. ఎక్కడా భౌతిక దూరం పాటించడం లేదు.
ఇటీవల ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ పేషెంట్‌కు కరోనా టెస్ట్‌ చేయించకుండా డయాలసిస్‌ చేశారు. ఆ వ్యక్తి కరోనాతో మృతిచెందడంతో మృతదేహన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించే సమయంలో కనీస జాగ్రతలు కూడా పాటించలేదు. ఫలితంగా ఆ ఆస్పత్రిలో 10 మందికి పైగా సిబ్బందితోపాటు ఓ వైద్యుడికి కూడా కరోనా పాజిటివ్‌గా వచ్చింది.
గతంలో కూడా ఓ ప్రైవేట్‌ వైద్యుడు కోవిడ్‌–19 నిబంధనలు పట్టించుకోకుండా వైద్యసేవలు అందించడతో కరోనా బారిన పడి చెన్నైలో మృతిచెందిన విషయం తెలిసిందే.
నగరంలోని రామలింగపురం అండర్‌బ్రిడ్జి పక్కనే ఉన్న ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిపై ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్‌ ఇద్దరు వైద్యాధికారుల చేత ఆకస్మిక తనిఖీలు చేయించారు. కానీ తనిఖీల సమాచారం ముందుగానే ఆస్పత్రి వర్గాలకు చేరడంతో వారు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.  

నిబంధనలు పాటించాల్సిందే..
జిల్లాలోని దాదాపు అన్ని ఆస్పత్రుల్లో ఓపీకి అనుమతి ఇచ్చాం. కోవిడ్‌–19 నిబంధనలు అన్ని ఆస్పత్రులు పాటించాల్సిందే. మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఆర్‌ఎంపీలు వైద్యం చేయరాదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాడులు చేసి సీజ్‌ చేశాం. – రాజ్యలక్ష్మి, డీఎంఅండ్‌హెచ్‌ఓ

మరిన్ని వార్తలు