ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే.. ‘కడుపు’ కోతే

6 Jun, 2014 02:34 IST|Sakshi
ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే.. ‘కడుపు’ కోతే

విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: ప్రైవేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తి గర్భిణులకు కడుపుకోత మిగులుస్తోంది. పురిటి నొప్పుల తో  ఆస్పత్రికి వచ్చిన వారికి సుఖ ప్రసవం చేయాల్సి న ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు సిజేరియన్లు చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సాధారణ ప్రసవాలు అయితే డబ్బులు తక్కువ వస్తాయని, సిజేరియన్లు చేసి డబ్బులు గుంజుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల్లో సగం వరకు సిజేరియన్లే ఉంటున్నాయంటే వారి ధనదాహం ఏ మేరకు ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. జిల్లాలో ప్రసవాలు నిర్వహిం చే ప్రైవేటు ఆస్పత్రులు 72 ఉన్నాయి. 2013 -14 సంవత్సరంలో ఆ ఆస్పత్రుల్లో 11,173 ప్రసవాలు జరిగితే వాటిలో 5,181 సిజేరియన్లు కావడం గమనార్హం. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు 59 ఉన్నాయి. వాటిలో 2013-14 సంవత్సరంలో 21,643 ప్రసవాలు జరగ్గా అందులో సిజేరియన్లు 4,234 మాత్రమే.
 
 కారణం ఇది
 సాధారణ ప్రసవం అయితే రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఆస్పత్రికి వస్తుంది. అదే సిజేరియన్ అయితే రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు ముడుతుంది.  దీంతో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు సిజేరియన్లకే ప్రాధాన్యమిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సాధారణ ప్రసవాలు చేస్తే ఆస్పత్రి మనుగడ కష్టమవుతుందని, అదే సిజేరియన్ అయితే నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చన్నది వైద్యుల భావనగా తెలుస్తోంది. ఆస్పత్రికి వచ్చే గర్భిణుల్లో అధికశాతం మందికి సాధారణ ప్రసవం అయ్యే పరిస్థితి ఉన్నా పట్టించుకోకుండా బిడ్డ అడ్డం తిరిగింది, బిడ్డ ఉమ్మినీరు తాగేసింది అత్యవసరంగా సిజేరియన్ చేయాలంటూ గర్భిణులను, ఆమె వెంట ఆస్పత్రికి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో బెదిరిపోతున్న వారు గత్యంతరం లేక సిజేరియన్ చేయడానికి అంగీకరిస్తున్నారు.
 
 సిజేరియన్‌తో అనర్థాలు
 సిజేరియన్ జరిగిన మహిళలు నడుం నొప్పి, తలనొప్పి వంటి సమస్యల బారిన పడతారు. మొదటి సారి సిజేరియన్ అయితే రెండోసారి కూడా సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సిజేరియన్ సమయంలో అధిక రక్తస్రావం అవుతుంది. ఒక్కో సమయంలో రక్తం ఎక్కించాల్సిన అవసరం కూడా రావచ్చు.
 
 నియంత్రణ కరువు
 ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ లేకపోవడం వల్లే  వాటి నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సిజేరియన్లు అవసరం లేకపోతే చేయకూడదని తెలిసి కూడా  వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులు నియమనిబంధనలను అతిక్రమిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లకు లొంగిపోయి చోద్యం చూస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో ప్రసవాలు నిర్వహించడానికి అవసరమైన సౌకర్యాలు లేనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అధికారులను ఎలాగైనా తమదారికి తెచ్చుకోవచ్చనే భావనలో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఉన్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి వస్తుందని పేద,సామాన్యతరగతి కుటుంబాల ప్రజలు వాపోతున్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు