దుర్గాఘాట్‌లో ప్రైవేటు దర్జా

24 Oct, 2018 09:40 IST|Sakshi

ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు బోటింగ్‌ ఆపరేటర్ల హవా

దుర్గగుడిపై ఏడాదికి రూ.75లక్షల నిర్వహణ భారం

అన్నీ తెలిసినా జోక్యం చేసుకోని మంత్రి ఉమా

సాక్షి, విజయవాడ: పవిత్ర కృష్ణానదీ తీరంలోని ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న దుర్గాఘాట్‌లో ప్రైవేటు వ్యక్తులకు ఆదాయ వనరుగా మారింది. నిర్వహణ వ్యయం దుర్గగుడి భరిస్తుండగా గత కొన్నేళ్లుగా జలవనరుల శాఖ ముసుగులో ప్రైవేటు వ్యక్తులు బోటింగ్‌ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అన్నీ తెలిసినా ప్రభుత్వ పెద్దలు మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. వందల ఏళ్లుగా దుర్గగుడి అధీనంలో ఉన్న దుర్గాఘాట్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాల పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2015లో ఇక్కడ ఫ్లైఓవర్‌ నిర్మించే సమయంలో ఈ ఘాట్‌ను జలవనరులశాఖ స్వాధీనం చేసుకుంది. పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దుర్గాఘాట్‌ను రివర్‌ ఫ్రంట్‌గా మార్చేసింది.

ప్రస్తుతం ఈ ఘాట్‌ నిర్వహణకు అయ్యే వ్యయాన్ని దుర్గగుడి భరిస్తుండగా.. ఘాట్‌పై ఇరిగేషన్‌ శాఖ ముసుగులో ప్రైవేటు బోటింగ్‌ ఆపరేటర్లు పెత్తనం సాగిస్తున్నారు. దుర్గాఘాట్‌లో దేవస్థానానికి చెందిన కేశఖండనశాల ఉండేది. దీన్ని 25ఏళ్ల కిందట సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మించారు. భక్తులు ఇక్కడ తలనీలాల మొక్కు చెల్లించి కృష్ణానదిలో పవిత్రస్నానం చేసిన తరువాత అమ్మవార్ని దర్శనం చేసుకునేవారు. ప్రభుత్వం కృష్ణానదీ తీరంలో 40 దేవాలయాలను కూల్చివేసినప్పుడే దీన్నీ కూల్చివేసింది. ఘాట్‌లోని మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, రూమ్‌ను, పిండప్రదానాల షెడ్లనూ తొలగించింది. దీంతో భక్తులకు కనీస సౌకర్యాలు లేక అగచాట్లు పడుతున్నారు. కనీసం షెల్టర్స్‌ లేకపోవడంతో ఘాట్‌లోనే మహిళలు కళ్లు తిరిగిపడిపోతున్నారు. నదిలో స్నానం చేసిన తరువాత దుస్తులు మార్చుకునేందుకు సౌకర్యాలు లేకపోయినా ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ప్రైవేటు బోటింగ్‌ ఆపరేటర్లు ఆక్రమించుకుని యథేచ్ఛగా తమ బోటింగ్‌ పార్కింగ్‌లను ఏర్పాటు చేసుకుని భక్తుల్ని అడ్డంగా దోచుకుంటున్నారు.

ఖర్చులు మాత్రం దుర్గగుడి ఖాతాలోనే...
దుర్గాఘాట్‌లో మూడు షిప్టులలో క్లీనింగ్‌ చేయిస్తున్నారు. ఘాట్‌లో అత్యంత ఖరీదైన సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. వీటి అంతటికి ఏడాదికి రూ.15లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చంతా దుర్గగుడి ఖాతా నుంచే చెల్లించమని ప్రభుత్వం ఆదేశించింది. దుర్గా ఘాట్‌ను తమకు అప్పగిస్తే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని దేవస్థానం అధికారులు చెబుతున్నారు.   దుర్గగుడికి కోనేరు లేనందున దుర్గాఘాట్‌నే కోనేరుగా అభివృద్ధి చేస్తే కోనేరు లోటు తీరుతుందని అంటున్నారు.

మంత్రి ఉమాకి అంతా ఎరుకే....
దుర్గగుడిలో జరిగే ప్రతి విషయం జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి వెళుతుంది. ఆయన కనుసన్నల్లోనే దుర్గాఘాట్‌ను జలవనరులశాఖ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం కృష్ణానదిలో స్నానాలు చేసే భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయనకు తెలుసు. ఆయనతోపాటు స్థానికంగా ఉన్న కొంతమంది తెలుగుదేశం నాయకులు ఘాట్‌ను దుర్గగుడికి అప్పగించేందుకు ఆసక్తి చూపడం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక్కడ ప్రైవేటు బోటింగ్‌ ఆపరేటర్లతోపాటు వ్యాపారస్తుల నుంచి ప్రతినెలా వచ్చే వాటాలు కోల్పోవాల్సి వస్తుందనే ఘాట్‌ను జలవనరులశాఖ ఆధీనంలో ఉంచుకున్నారని పేర్కొంటున్నారు.   

మరిన్ని వార్తలు