క్యాం'పెయిన్‌'..!

16 Apr, 2019 13:02 IST|Sakshi

అడ్మిషన్లు చేస్తేనే జీతాలు

కార్పొరేట్‌ స్కూల్, కళాశాలల బోధకులకు టార్గెట్లు

లేకుంటే ఉద్యోగానికి గ్యారంటీ లేదనంతో టెన్షన్‌

మండుటెండలో ఇంటింటికీ తిరుగుతూ పాట్లు

సార్‌..మీ అమ్మాయి/అబ్బాయిని మా స్కూల్లో చేర్పించండి. మీ పిల్లల్ని చేర్పించకుంటే మీ ద్వారా ఎవరైనా ఉంటే చెప్పండి సార్‌..ప్లీజ్‌. పదిమందిని చేర్చాలని యాజమాన్యం టార్గెట్‌ విధించింది. లేకుంటే మా జీతం కట్‌ అవుతుంది. కనీస టార్గెట్‌కు చేరుకోకపోతే వచ్చే సంవత్సరం ఉద్యోగం నుంచి తొలగిస్తారు. గ్రామాల్లో ప్రైవేటు టీచర్లు ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రుల ముందు ప్రాధేయపడుతున్న దయనీయ దుస్థితిది.

తూర్పుగోదావరి , రాయవరం (మండపేట): ప్రైవేటు/కార్పొరేట్‌ పాఠశాలల్లో చిరుద్యోగుల బతుకులు చిత్తవుతున్నాయి. జూన్‌ నెలలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే విద్యార్థుల కోసం అడ్మిషన్ల వేట మొదలైంది. ప్రైవేట్‌/కార్పొరేట్‌ పాఠశాల యాజమాన్యాలు పెట్టే నిబంధనలకు ఆ పాఠశాలల్లో పని చేయాలో? లేక బయటకు రావాలో... తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉద్యోగులు పని చేస్తున్నారు. జిల్లాలో దాదాపుగా 1700 ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్లున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపుగా 30 వేల మంది వరకూ సిబ్బంది పని చేస్తున్నారు.

టార్గెట్‌ చేరుకుంటేనే జీతాలు..: ప్రైవేట్‌/కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు గత నెల నుంచే ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గ్రామాలు, పట్ట ణాల్లోకి పంపిస్తున్నారు. ఓట్ల ప్రచారం, ఇంటింటి సర్వేలు చేసే వాళ్లలా ఉపాధ్యాయులు ప్రతి ఇంటికీ వెళ్లి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా..ఏం చదువుతున్నారని అడిగి వారిని తమ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. ఓసారి మా పాఠశాలలో వసతులు చూడండి..ఫీజులు పరిశీలించండి...ఫలితాలు చూడండంటూ ఏకరువు పెడుతున్నారు. కొందరు టీచర్లు వారి దగ్గర చదువుకునే పిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని కూడా వదలడం లేదు. ఆ వీధిలో ఉండేవారినో, బంధువుల పిల్లలనైనా మా స్కూల్లో, లేదా కళాశాలలో చేర్పించాలంటూ ప్రాధేయపడుతున్నారు. ఎలాగోలా వారికి ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్‌ పూర్తి చేస్తేనే మార్చి, ఏప్రిల్‌ నెలల జీతాలు ఇస్తామని కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు నిబంధనలు పెట్టాయి. ఒక్కొక్కరు 10–15 మంది పిల్లలను కచ్చితంగా పాఠశాలలో చేర్పించాలి. అలా చేర్పిస్తేనే జీతాలు ఇస్తారు. లేకుంటే జీతం రాదు. ఆ తర్వాత ఆ పాఠశాలలో ఉద్యోగం ఉంటుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇచ్చే అరకొర జీతాలు నిలిపి వేస్తారనే భయంతో ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు.

ఆకర్షణలతో మోసపోతున్న తల్లిదండ్రులు...
పాఠశాలల ప్రత్యేకతలను గ్రాఫిక్స్‌లో చూపించడంతో తల్లిదండ్రులు ఆకర్షణకు లోనవుతున్నారు. ప్రభుత్వ, స్థానిక ప్రైవేటు పాఠశాలలకు మించి తమ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వివరిస్తున్నారు. రోజువారీ టెస్ట్‌లు, ప్రతి రోజూ స్టడీ అవర్స్, కంప్యూటర్, లైబ్రరీ, ల్యాబ్, ప్రతి పండుగ సెలబ్రేషన్, ఆటపాటలతో పాటు కరాటే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యోగులు బదిలీ అయితే అదేచోట బ్రాంచ్‌కు విద్యార్థుల బదిలీ సౌకర్యం కల్పిస్తామని కార్పొరేట్‌ స్కూల్‌ సిబ్బంది వివరిస్తున్నారు. విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకొని అడ్మిషన్‌ ఫీజు కట్టించుకునే వరకూ కేవలం పాఠశాల ఫీజు మాత్రమే చెబుతారు. ఫీజు చెల్లించిన తర్వాత బస్సు ఫీజు, యూనిఫామ్, బుక్స్‌ ఫీజు అంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కార్పొరేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌లో ఫిక్స్‌ చేసిన ఫీజులని చెబుతున్నారు. దీంతో ముందుగా క్యాంపైన్‌ తిరిగి పిల్లలను చేర్చిన ఉపాధ్యాయులపై తల్లిదండ్రుల ఒత్తిళ్లు పెరుగుతుండడంతో మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై జిల్లా విద్యాశాఖ దృష్టి పెట్టి ఉపాధ్యాయులపై వేధింపులు నిరోధించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరుతాయనే ఆశతో ఉన్నామని పలువురు ఉపాధ్యాయులు ‘సాక్షి’తో చెప్పారు.

మరిన్ని వార్తలు